లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీల మధ్య పొత్తు ఓట్ల లెక్కింపు జరిగేంత వరకేనని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ( Amit Shah ) జోష్యం చెప్పారు. ఒకవేళ సమాజ్‌వాది పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తే జయంత్ చౌధరి నేతృత్వంలోని ఆర్ఎల్డీ పార్టీని కూటమి నుంచి బయటికి గెంటేస్తారని అన్నారు.
సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఎలాగైనా అధికారం సాధించాలనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో చాలా చిన్న పార్టీలతో పొత్తుకున్నాడని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఆర్ఎల్డీకి పెద్దగా విజయం దక్కే అవకాశాలు లేవని, వారు బరిలో నిలిపిన అభ్యర్థులను చూస్తేనే ఆ విషయం అర్థమవుతుందని అమిత్ షా అన్నారు.
అందుకే ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం అఖిలేష్ యాదవ్ ఆర్ఎల్డీని దూరం పెడుతారని అన్నారు. పైగా జైల్లో ఉన్న అజాంఖాన్‌ను బయటికి తీసుకొచ్చి ప్రభుత్వంలో కూర్చోబెడుతారని షా విమర్శించారు.