Mani Shankar Aiyar | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్.. సొంత పార్టీ నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మలి విడత యూపీఏ ప్రభుత్వంలో ప్రణబ్ ముఖర్జీని ప్రధానిగా, డాక్టర్ మన్మోహన్ సింగ్ను రాష్ట్రపతిని చేయాల్సిందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రణబ్ ముఖర్జీని ప్రధానిని చేసి, మన్మోహన్ సింగ్ ను రాష్ట్రపతిని చేసి ఉంటే 2014లో అవమానకర రీతిలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలయ్యేది కాదని వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితం, జాతీయ పరిణామాలపై కొత్తగా పుస్తకం రాసిన మణిశంకర్ అయ్యర్.. సంచలన విషయాలు పేర్కొన్నారు. 2013లో దేశంలో సుపరిపాలన లేనందు వల్లే 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమితోపాటు కేవలం 44 సీట్లకు పరిమితమైందన్నారు.
‘2012లో రెండు విషాదకర ఘటనలు జరిగాయి. సోనియాగాంధీ అనారోగ్యానికి గురి కావడం ఒకటి. డాక్టర్ మన్మోహన్ సింగ్కు ఆరు బైపాస్ సర్జరీలు జరిగాయి. ప్రభుత్వ సారధి, పార్టీ సారధి లేకపోవడంతో మేమంతా చేష్టలుడిగి ఉన్నాం’ అని మణిశంకర్ అయ్యర్ పేర్కొన్నారు. అప్పట్లో పూర్తి శక్తి సామర్థ్యాలు గల నేత ప్రణబ్ ముఖర్జీ అని వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధికి భారీ భాగస్వామ్యం అందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ను రాష్ట్రపతిని చేసి గౌరవించాల్సిందన్నారు. ప్రణబ్ ముఖర్జీ ప్రధాని అయి ఉంటే 2014 ఎన్నికల్లో ఓటమి పాలైనా కాంగ్రెస్ పార్టీ బలం 144 స్థానాలకు తగ్గేదన్నారు. 2013లో 2జీ కుంభకోణం కేసులో డీఎంకే నేతలు ఏ రాజా, కే కనిమొళి అరెస్టయి జైల్లో ఉన్నారని గుర్తు చేశారు.