న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) టీవీ చర్చా కార్యక్రమంలో పలు అంశాలపై మాట్లాడారు. ఇండియా బ్లాక్ నాయకత్వం, ఆర్టికల్ 370, పాకిస్థాన్‌తో సంబంధాలతో సహా కీలక రాజకీయ అంశాలను ఆయన ప్రస్తావించారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌ను ‘ఇండియా’ బ్లాక్ హెడ్‌గా చేసి ఉంటే కూటమిని ఆయన వీడేవారు కాదని తెలిపారు. ‘నితీశ్ కుమార్‌ను ఇండియా బ్లాక్ కన్వీనర్‌గా చేయడానికి మేం ప్రయత్నించాం. అయితే ఆయన చీఫ్‌గా ఉండటంపై కూటమిలోని కొన్ని వర్గాలు సంతోషంగా లేవు. ఆయనను చీఫ్‌గా చేయడంలో మేం విజయం సాధించినట్లయితే, ఇప్పటికీ మాతో ఉండేవారు’ అని అన్నారు.
కాగా, జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పని తీరు గురించి అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని ఒమర్ అబ్దుల్లా దాటవేశారు. పార్టీకి నాయకత్వం వహిస్తున్న తండ్రి ఫరూక్ అబ్దుల్లా నిర్ణయంపై విమర్శలు చేయబోనని చెప్పారు. ‘అతడు నా బాస్. ఆయన వ్యాఖ్యను నేను ఖండించలేను’ అని అన్నారు. జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
మరోవైపు పాకిస్థాన్‌తో చర్చలకు సంబంధించిన బాధ్యత ఆ దేశానికే ఎక్కువగా ఉందని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ముంబై దాడులు, జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదంపై భారత్ ఆందోళనలను పరిష్కరించడానికి పాకిస్థాన్ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ‘పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న జమ్ముకశ్మీర్ భాగాన్ని తిరిగి తీసుకురావాలని మేం కోరుకుంటున్నాం. దీనికి యుద్ధం పరిష్కారం కాదు. చర్చలు అవసరం’ అని అన్నారు.