Amit Shah : బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ప్రచారంలో సీనియర్ బీజేపీ నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తన మాటల జోరును పెంచారు. శనివారం ఖగారియా (Khagaria) లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన షా.. ప్రతిపక్ష కూటమిపై దుమ్మెత్తిపోశారు. ప్రతిపక్ష మహాఘట్బంధన్కు ఓటువేస్తే ఆటవిక పాలనను కొనితెచ్చుకున్నట్లేనని ఓటర్లను షా హెచ్చరించారు.
ఎన్డేయే సర్కారు బీజేపీని అభివృద్ధిపథంలో నడిపించిందని అమిత్ షా అన్నారు. మళ్లీ అధికార కూటమినే గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ఆటవిక పాలన కావాలో, అభివృద్ధి పాలన కావాలో మీరే తేల్చుకోవాలని అన్నారు. లాలూ, రబ్రీదేవీల సర్కారు వచ్చిందంటే.. దాంతోపాటు జంగిల్‌రాజ్ కూడా వస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్డీయేని గెలిపిస్తే అభివృద్ధి చెందిన బీహార్‌ను చూస్తారని చెప్పారు.
ఎన్డీయే కూటమి ఐదుగురు పాండవులతో కూడిన కూటమి అని, ఈ కూటమిని గెలిపిస్తే రాష్ట్రంలో అన్నీ విజయాలేనని షా అన్నారు. ఈ మహాఘట్బంధన్, లఠ్బంధన్లు రికార్డు స్థాయిలో అవినీతికి పాల్పడ్డాయని షా ఆరోపించారు. ‘వాళ్లు బీహార్‌ను అభివృద్ధి చేస్తారా..?’ అని ప్రశ్నించారు. నయాపైసా కూడా అవినీతికి పాల్పడని నరేంద్రమోదీ, నితీశ్కుమార్లతోనే బీహార్ అభివృద్ధి సాధ్యమని చెప్పారు.