శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో శక్తివంతమైన బాంబు పేలింది. ఒక వ్యక్తి మరణించగా 14 మంది గాయపడ్డారు. రద్దీగా ఉండే ఉధంపూర్ మార్కెట్ వద్ద బుధవారం ఈ సంఘటన జరిగింది. జిల్లా కోర్టు సముదాయం సమీపంలోని స్లాథియా చౌక్‌లో మధ్యాహ్నం 1 గంటకు ఐఈడీ పేలినట్లు జమ్మూ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) ముఖేష్ సింగ్ తెలిపారు. ఈ సంఘటనలో ఒకరు చనిపోగా, 14 మంది గాయపడినట్లు చెప్పారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.
కాగా, పేలుడు జరిగిన ప్రాంతంలో బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే వ్యాపారులున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడు కోసం ఐఈడీని వినియోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీస్ అధికారులు వెల్లడించారు. పేలుడు చాలా శక్తివంతమైనదని అన్నారు. మరోవైపు బాంబు పేలుడు తీవ్రతకు సమీపంలోని కొన్ని ఇనుప గ్రిల్స్ దెబ్బతిన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.