HMPV | చైనాలో భయాందోళనలకు గురి చేస్తున్న హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ (HMPV) భారత్‌లో చాలా బలహీనంగా ఉన్నది. గత మూడునెలలుగా పలు రాష్ట్రాల్లో ఐదు రకాల వైరస్లు హెచ్పీఎంవీ వైరస్ కంటే ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. ఇండియన్ కౌల్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నివేదికలో ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. నివేదిక ప్రకారం.. ప్రతి సంవత్సరం తరహాలోనే ఈ సారి కూడా భారత్‌లో హెచ్1ఎన్1 అంటే.. స్వైన్‌ఫ్లూ, హెచ్3ఎన్2, విక్టోరియా, కరోనా, ఆర్ఎస్ వైరస్ కేసులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ అంటువ్యాధులన్నింటి లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి. దాని కారణంగా ఆసుపత్రులకు చేరే జలుబు, దగ్గు ఉన్న రోగుల్లో ఈ వైరస్‌లను గుర్తిస్తున్నారు.
ఈ ఐదు వైరస్‌లతో పోలిస్తే హెచ్ఎంపీ చాలా పరిమితి స్థాయిలో ఉంది. భారతదేశంలో వివిధ రకాల వైరస్లు, వాటి వ్యాప్తిని పర్యవేక్షించేందుకు ఐసీఎంఆర్-ఎస్ఏఆర్ఐ నిఘా నెట్వర్క్ని ఏర్పాటు చేసిందని ఓ అధికారి తెలిపారు. ఈ నెట్వర్క్ దేశంలోని దాదాపు అన్ని పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులతో పాటు ల్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చే రోగుల నమూనాలను, వారి నివేదికల ఆధారంగా ప్రతినెలా సమీక్షించి నివేదికను రూపొందిస్తుంటారు. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అతుల్ గోయల్ అధ్యక్షతన జరిగిన వర్చువల్ సమావేశంలో ఈ నివేదికను షేర్ చేస్తూ..
హెచ్పీఎం దేశంలో ఎక్కడా అసాధారణంగా పెరిగే సూచనలు కనిపించడం లేదని తెలిపారు. నివేదికను ఉటంకిస్తూ.. 2024 చివరి వారంలో విక్టోరియా వైరస్ 26శాతం నమూనాల్లో గుర్తించారు. 14శాతం నమూనాల్లో ఆర్ఎస్వీ పాజిటివ్‌గా తేలింది. ఆరుశాతం శాంపిల్స్‌లో హెచ్3ఎన్2 వైరస్, 12 శాతంలో హెచ్1ఎన్1 వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు. విక్టోరియా వైరస్ అనేది ఇన్ఫ్లుయెంజా బీ వైరస్ వంశానికి చెందింది. అయితే, ఆర్ఎస్వీ అనేది హెచ్ఎంపీ వైరల్ వంశానికి చెందిందే. ఈ రెండు వైరస్లు ఒకే కుటుంబానికి చెందినవి కాగా.. రెండు కాలానుగుణంగా వ్యాప్తి చెందుతాయి. శీతాకాలం ప్రారంభంలో ఆర్ఎస్వీ కేసులు పెరుగుతాయి. హెచ్ఎంపీవీ కేసులు శీతాకాలం మధ్య నుంచి వసంతకాలం ప్రారంభం వరకు పెరుగుతుంటాయని ఆ అధికారి వివరించారు.