న్యూఢిల్లీ : భారత్‌లో ఇటీవల ట్విట్టర్ ఖాతాలు హ్యాకింగ్ బారినపడుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే పలువురి ప్రముఖుల ఖాతాలు హ్యాక్ కాగా.. తాజాగా బుధవారం ఉదయం కేంద్ర సమాచార, ప్రచార శాఖ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. కొద్ది సేపటి తర్వాత ఖాతాను తిరిగి పునరుద్ధరించినట్టు అధికారులు వెల్లడించారు. కొద్దిసేపటి వరకు సమాచార శాఖ ట్విట్టర్ హ్యాండిల్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్లు.. పేరును ‘ఎలాన్ మస్క్’గా మార్చడంతో పాటు 50కిపైగా వరుస ట్వీట్లు చేశారు. హరీ అప్ (Hurry Up) , అమేజింగ్ (Amazing) అంటూ రాసి వాటి కింద టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఫొటోతో హైపర్ లింక్‌లు పోస్ట్ చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఖాతాను పునరుద్ధరించి ఆ ట్వీట్లను డిలీట్ చేసింది.
ఆ తర్వాత ‘ఖాతాను పునరుద్ధరించినట్లు’ ట్వీట్ చేసింది. అయితే, ఎవరు హ్యాక్ చేశారనే విషయంపై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ((MeIT)కి చెందిన ఐటీ T సెక్యూరిటీ గ్రూప్ (CERT-IN) పరిశీలిస్తున్నది. ఇదిలా ఉండగా.. గత నెల రోజుల కిందట డిసెంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ అధికార ట్విట్టర్ ఖాతా సైతం హ్యాక్‌కు గురైన విషయం తెలిసిందే. హ్యాకర్లు భారతదేశం ‘బిట్ కాయిన్‌ను అధికారికంగా చట్టబద్ధమైన బిడ్‌గా స్వీకరించింది‘ అని పేర్కొంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత అధికారులు వెంటనే ఖాతాను పునరుద్ధరించారు. అలాగే ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్ (ICWA), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA), మన్ దేశి మహిళా బ్యాంక్ ట్విట్టర్ ఖాతాలూ హ్యాకింగ్‌కు గురయ్యాయి.