బెంగుళూరు: కర్నాటకలో ఇద్దరు మహిళా ఆఫీసర్ల మధ్య వైరం అందర్నీ షాక్‌కు గురిచేస్తోంది. ఆ రాష్ట్ర హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ డీ రూపా మౌద్గిల్(IPS Roopa).. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమీషనర్ రోహిణి సింధూరి(IAS Rohini Sindhuri) మధ్య ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఫైట్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు పబ్లిక్‌గా ఆరోపణలు చేసుకుంటారు. ఆ ఇద్దరు ఆఫీసర్ల ప్రవర్తనపై ఆ రాష్ట్ర హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర కూడా విస్మయం వ్యక్తం చేశారు. ఇద్దరిపై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
ఐఏఎస్ సింధూరికి చెందిన కొన్ని ఫోటోలను ఐపీఎల్ రూప తన ఫేస్బుక్లో షేర్ చేసింది. ముగ్గురు ఐఏఎస్ మేల్ ఆఫీసర్లకు సింధూరి తన ఫోటోలను పంపి సర్వీస్ రూల్స్‌ను బ్రేక్ చేసినట్లు రూప తన పోస్టులో ఆరోపించింది. సింధూరిపై అవినీతి ఆరోపణలు ఉన్నట్లు కూడా రూప తన పోస్టులో పేర్కొన్నది. దీనిపై కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మైకు, సీఎస్ వందితా శర్మకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నది.
ఐపీఎస్ రూప ప్రవర్తనతో చిరాకుకు గురైన ఐఏఎస్ సిందూరి ఆదివారం ఓ ప్రకటన జారీ చేసింది. తనపై వ్యక్తిగతంగా, తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు సింధూరి ఆరోపించింది. తన వాట్సాప్‌లోని స్క్రీన్షాట్లను తీసి, సోషల్ మీడియాలో ఉన్న ఫోటోలను తీసి.. తనను డీఫేమ్ చేసేందుకు రూప ప్రయత్నించినట్లు సింధూరి ఆరోపించారు. ఐపీఎస్ రూప మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు ఐఏఎస్ సింధూరి ఆరోపించారు. ఆమె వెంటనే కౌన్సిలింగ్, చికిత్స తీసుకోవాలన్న సూచన చేశారు.
మహిళా ఆఫీసర్ల రగడ గురించి పోలీసు చీఫ్‌తో చర్చించినట్లు కర్నాటక హోంమంత్రి తెలిపారు. ఈ గొడవ పట్ల సీఎం బొమ్మైకు కూడా అవగాహన ఉందన్నారు. వ్యక్తిగత జీవితాల గురించి పబ్లిక్‌గా, సాధారణ ప్రజలు కూడా మాట్లాడని రీతిలో వ్యవహరించడం సహించబోమని మంత్రి తెలిపారు.
ఇటీవల ఐఏఎస్ సింధూరి.. జనతాదళ్ ఎమ్మెల్యే సారా మహేశ్‌తో కలిసి ఓ రెస్టారెంట్లో కూర్చున్న ఫోటో వైరల్ అయ్యింది. నిజానికి ఆ ఇద్దరూ తరుచూ అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. మైసూరులో కమీషనర్‌గా ఉన్న సమయంలో ఆ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఈనేపథ్యంలో ఐపీఎస్ రూప ప్రశ్నలు సంధించింది. ఓ రాజకీయవేత్తతో ఐఏఎస్ సింధూరి ఎందుకు కలిసిందని, ఆ ఇద్దరి మధ్య ఏదో డీల్ కుదిరినట్లు రూప ఆరోపించింది. ఆ ఆరోపణలను సింధూరి కొట్టిపారేశారు.
ఇద్దరు మహిళా ఆఫీసర్ల కీచులాటను సీఎం బొమ్మై లైట్‌గా తీసుకున్నారు. అది పర్సనల్ మ్యాటర్ అన్నారు. కానీ ఆ ఇద్దరూ మరీ నీచంగా ప్రవర్తిస్తున్న తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.