న్యూఢిల్లీ, జూలై 19: ఆత్మ నిర్భరత దేశ రక్షణను పణంగా పెట్టదని భారత వైమానిక దళ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బహుళ ప్రయోజనాలతో తయారు చేసే యుద్ధ విమానం తేజస్ ఎంకేఐఏ సరఫరాలో జరుగుతున్న జాప్యంపై ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశ రక్షణ పరికరాల తయారీలో ఆత్మనిర్భరతను అమలు చేస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగా చాలామటుకు కాంట్రాక్టులు భారత్‌కు చెందిన కంపెనీలే చేపడుతున్నాయన్నారు. అలా అని ఆత్మనిర్భరత కోసం దేశ రక్షణను పణంగా పెట్టమని, మనకు దేశ రక్షణే ప్రథమం, ముఖ్యం అని పేర్కొన్నారు. దేశ రక్షణ విషయానికొస్తే దీనిని చూసే బాధ్యత కేవలం యూనిఫాం వేసుకున్న వ్యక్తులదే కాదు అందరిదీ అని అన్నారు.
చాందిపుర వైరస్‌తో మరో బాలుడు మృతి
అహ్మదాబాద్, జూలై 19: గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి కలకలం రేపుతున్నది. ఈ వైరస్ బారిన పడి సబర్కాంత్ జిల్లాలో ఒక చిన్నారి మృతి చెందగా, తాజాగా వడోదర జిల్లాలో మరో మరణం సంభవించింది. దీంతో ఈ వ్యాధి మృతుల సంఖ్య రెండుకు చేరింది. గత కొన్ని రోజులుగా గుజరాత్లో చాందిపుర వైరస్ కేసులు నమోదవుతున్నాయి.
300 కోట్ల విలువైన భూమి అటాచ్
న్యూఢిల్లీ, జూలై 19: కాంగ్రెస్ నేత, హర్యానా మాజీ సీఎం దీపందర్ సింగ్ హూడాకు సంబంధం ఉందని చెప్తున్న భూ కుంభకోణం కేసులో ఎం3ఎం రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన రూ.300 కోట్ల విలువైన భూమిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. హర్యానాలోని గురుగ్రామ్ జిల్లా బషారియా గ్రామంలో ఉన్న 88.28 ఎకరాలను అటాచ్ చేశామని, దీని విలువ రూ.300.11 కోట్లు ఉంటుందని ఈడీ శుక్రవారం ప్రకటించింది. హర్యానాలోమోసపూరితంగా భూసేకరణ నోటీసులు ఇవ్వడం ద్వారా వారు తక్కువ ధరలకే కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు అమ్మేలా చేశారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది.
‘కన్వర్ యాత్ర’ ఆదేశాలు యూపీ అంతటికీ వర్తింపు
లక్నో: కన్వర్ యాత్ర నేపథ్యంలో హోటళ్లు, దాబాలు, తినుబండారాల దుకాణాల యజమానులకు జారీ చేసిన ఆదేశాలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వర్తింపచేసింది. ఈ యాత్ర జరిగే మార్గంలోని దుకాణాల యజమానుల పేర్లు, చిరునామాలు, ఫోన్ నెంబర్లను అందరికీ కనిపించేలా రాయాలని కొద్ది రోజుల క్రితం ముజఫర్ నగర్ పోలీసులు ఆదేశించారు. దీనిపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఎన్డీయే కూటమిలోని కొన్ని పార్టీలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. ముస్లిం వర్తకులను లక్ష్యంగా చేసుకుని ఈ ఆదేశాలు ఇచ్చారని విమర్శించాయి.