న్యూఢిల్లీ, జూన్ 13: అస్సాంలోని జోర్హాట్లో ఉన్న రౌరియా వైమానిక దళ కేంద్రం వద్ద శనివారం ఏఎన్-32 రవాణా విమానం కూలిపోయి భారతీయ వైమానిక దళానికి చెందిన ఐదుగురు సిబ్బంది మరణించారు. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన కో-పైలట్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు ఐఏఎఫ్ అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో ప్రాణ నష్టం పట్ల ఏఐఎఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని ఎక్స్ వేదికగా తెలిపింది. మరణించిన ఐదుగురు సిబ్బందిని స్కాడ్రన్ లీడర్ ప్రశాంత్ సింగ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభం ఉమార్, సార్జంట్ జితేంద్ర శర్మ, అగ్నివీర్ వాయు ఖేమారం కుమావత్, అగ్నివీర్ వాయు దానిష్ ఆలమ్గా గుర్తించారు. ఎగువ అస్సాంలో వ్యూహాత్మకంగా ముఖ్యమైన వైమానిక కేంద్రం ప్రాంగణం లోపలే ఏఎన్-32 రవాణా విమానం కూలిపోయింది. ఇది అరుణాచల్ ప్రదేశ్ నుంచి జోర్హాట్కు వస్తున్నది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారు అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రమాదానికి కారణాలను నిర్ధారించేందుకు ఐఏఎఫ్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించింది.