న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ తెలిపారు. (Engineer Rashid) సమస్యలపై ప్రజాస్వామ్యయుతంగా పోరాడతానని చెప్పారు. ఉగ్రవాద నిధుల కేసులో మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో తీహార్ జైలులో సోమవారం లొంగిపోయారు. ఇంజినీర్ రషీద్‌గా పేరొందిన ఆయన దీనికి ముందు మీడియాతో మాట్లాడారు. ‘కశ్మీర్ ప్రజల కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. మేం ఏ తప్పు చేయలేదు. మాకు న్యాయం జరుగుతుంది. జైల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా కశ్మీర్లో శాంతి, ప్రజల సంక్షేమం కోసం గౌరవంగా మాట్లాడుతాం. మేం ఎవరికీ లొంగిపోం’ అని అన్నారు.
కాగా, తన జైలు శిక్ష గురించి భయపడవద్దని కశ్మీర్ ప్రజలను రషీద్ కోరారు. పోరాడి గెలుస్తామని అన్నారు. ‘మేం ఏ నేరం చేయలేదు. నేను జైలుకు వెళ్లడం గురించి చింతించను. నా ప్రజలకు దూరంగా ఉంటానన్న ఒకే ఒక భావన ఉంది’ అని అన్నారు.
మరోవైపు జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తారని తాము ఆశిస్తున్నట్లు ఇంజినీర్ రషీద్ తెలిపారు. ఆయన ఏ మంచి చేసినా తాను మద్దతిస్తానని చెప్పారు. కశ్మీరీలకు అనుకూలంగా పనిచేయకపోతే ప్రజాస్వామ్యయుతంగా పోరాడతామని అన్నారు.
జమ్ముకశ్మీర్‌లో ఉగ్ర దాడులను రషీద్ ఖండించారు. అలాగే పాకిస్థాన్‌పై ఫరూక్ అబ్దుల్లా విరుద్ధ వైఖరిని ఆయన తప్పుపట్టారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక అభిప్రాయాన్ని, అధికారంలో లేనప్పుడు మరొక అభిప్రాయాన్ని ఆయన చెబుతారని విమర్శించారు. కాగా, జమ్ముకశ్మీర్ ఎన్నికల కోసం విడుదలైన రషీద్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణను ఢిల్లీ కోర్టు నవంబర్ 19కి వాయిదా వేసింది.