Abdur Rahim Bakshi : పశ్చిమబెంగాల్ (West Bengal) లో ఓ బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) పై తృణమూల్ కాంగ్రెస్ నేత (TMC leader) అబ్దుర్ రహీం (Abdur Rahim) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఓ కార్యక్రమంలో మాల్దా జిల్లా టీఎంసీ అధ్యక్షుడు అబ్దుర్ రహీం బక్షి మాట్లాడుతూ.. బీజేపీ ఎమ్మెల్యే శంకర్ ఘోష్ (Shanker Ghosh) పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బెంగాల్ నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన 30 లక్షల మందిని బంగ్లాదేశీయులు, రోహింగ్యాలుగా అభివర్ణిస్తూ అసెంబ్లీలో శంకర్ ఘోష్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయన నోట్లో యాసిడ్ పోసి బూడిద చేస్తానంటూ హెచ్చరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ వాసులను వేధిస్తున్నారని, నిర్బంధ శిబిరాల్లో ఉంచుతున్నారని ఆరోపించారు.
బెంగాల్ ప్రజలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్న బీజేపీని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని ప్రజలను కోరారు. అబ్దుర్ రహీం వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. అధికార టీఎంసీ రాష్ట్రంలో హింస, బెదిరింపు సంస్కృతులను పెంచుతోందని ఆరోపించింది. త్వరలో ఎన్నికలు రానుండటంతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే భయంతో టీఎంసీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ నేత ఖాగెన్ ముర్ము అన్నారు.
బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను నిరోధించడంలో విఫలమైనందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శిరస్సు ఖండించి బల్లపై ఉంచాలంటూ టీఎంసీ ఎంపీ మహువా చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇటీవల దుమారం రేపిన విషయం తెలిసిందే. వివాదాల జోలికి పోవద్దని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించినప్పటికీ.. వరుసగా టీఎంసీ నేతలు తమ వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.