న్యూయార్క్: 2008 ముంబై ఉగ్రదాడి కేసులో నిందితుడు తహవుర్ రాణా(Tahawwur Rana).. అమెరికా సుప్రీంకోర్టులో అభ్యర్థన పెట్టుకున్నాడు. భారత్‌కు తనను అప్పగించవద్దు అని కోరాడు. రాణా అప్పగింతకు ట్రంప్ సర్కార్ ఇటీవల పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. అయితే ఇండియాకు తనను అప్పగిస్తే, ఆ దేశం తనను చిత్రహింస పెడుతుందని తన అభ్యర్థన లేఖలో అమెరికా సుప్రీంకోర్టుకు తెలిపాడు. అప్పగింతపై తక్షణమే స్టే విధించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని రాణా కోరాడు. ఉగ్రదాడి కేసులో ఇండియాలో విచారణ చేపడితే, తాను ఎక్కువ కాలం జీవించలేనని రాణా తన అభ్యర్థనలో వెల్లడించాడు. ఒకవేళ స్టే ఇవ్వకుంటే, దీనిపై సమీక్ష ఉండదని, అమెరికా కోర్టులు తమ పరిధిని కోల్పోతాయని, ఇక రాణా సజీవంగా ఉండలేరని సుప్రీంకోర్టు పిటీషన్లో తెలిపాడు.
పాకిస్తాన్ మూలాలు ఉన్న ముస్లింను కాబట్టి.. ఒకవేళ భారత్‌కు అప్పగిస్తే, తనను ఆ దేశం వేధిస్తుందన్నాడు. గతంలో పాక్ ఆర్మీలో చేశానని, 2208 ముంబై దాడులతో లింకుందని ఆరోపిస్తున్నారని, తన ఆరోగ్యం దృష్ట్యా భారత్‌కు తనను అప్పగించవద్దు అని ఆయన కోరాడు. 2023 మానవ హక్కుల నివేదిక ప్రకారం.. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం మైనార్టీలను వ్యవస్థీకృతంగా వివక్షకు గురిచేస్తున్నదని, అక్కడ ప్రభుత్వం చాలా నిరంకుశంగా మారిందని, ఒకవేళ భారత్‌కు అప్పగిస్తే తనకు చిత్రహింస జరుగుతుందని తన అభ్యర్థనలో రాణా పేర్కొన్నాడు.
పాకిస్థానీ అమెరికా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీకి సన్నిహితుడు తహవూర్ రాణా. 2008, నవంబర్ 26వ తేదీన ముంబైలో జరిగిన ఉగ్ర పేలుళ్లలో హేడ్లీ ప్రధాన నిందితుడు. రాణాకు పాక్‌లోని లష్కరే తోయిబా, ఐఎస్ఐ ఉగ్ర సంస్థలతో లింకు ఉన్నది.