Tejpratap Yadav : బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Laluprasad Yadav) పెద్ద కుమారుడు, ఆ రాష్ట్ర మాజీ మంత్రి తేజ్‌ప్రతాప్ యాదవ్ (Tejpratap Yadav) కొత్త పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. ‘జనశక్తి జనతాదళ్ (Janshakti Janta Dal)’ పేరుతో కొత్తపార్టీ పెట్టినట్లు ఆయన నిన్న (శుక్రవారం) ప్రకటించారు. బ్లాక్‌బోర్డు (Block board) తన పార్టీ గుర్తు అని చెప్పారు. ఈ మేరకు రాష్ట్రమంతటా పార్టీ పోస్టర్లు (Party posters) వేయించారు.
అయితే ఆ పోస్టర్లలో మహాత్మాగాంధీ సహా పలువురు ప్రముఖుల ఫొటోలు ఉన్నా, అతడి తల్లిదండ్రుల ఫొటోలు మాత్రం లేవు. దీనిపై మీడియా ప్రశ్నించగా.. తన తల్లిదండ్రులు వేరే పార్టీకి చెందిన వారని, అలాంటప్పుడు వాళ్ల ఫొటోలను మా పోస్టర్లలో ఎలా వేస్తామని తేజ్‌ప్రతాప్ ప్రశ్నించారు. వాళ్లు ఇప్పుడు ఆర్జేడీలో ఉన్నారని, వాళ్ల ఫొటోలను మా పోస్టర్లలో వేయడానికి మా పార్టీ రాజ్యాంగం ఒప్పుకోదని చెప్పారు.
అయితే హోర్డింగులపై వేసే పోస్టర్లలో పెట్టుకునే ఫొటోలు ఇవాళ ఉంటాయి, రేపు తీసేస్తారని తేజ్‌ప్రతాప్ వ్యాఖ్యానించారు. తన తల్లిదండ్రులపై తనకు ఎంతో ప్రేమ అని, వాళ్లు ఎప్పుడూ తన గుండెల్లో ఉంటారని అన్నారు. అయినా తేజస్వియాదవ్ పోస్టర్లలో కూడా మా తల్లిదండ్రుల ఫొటోలు లేవని, ఎందుకు లేవో వెళ్లి జైచంద్‌ను అడగండని మీడియా ప్రతినిధికి వ్యంగ్యంగా సలహా ఇచ్చారు.