బెంగళూరు, జనవరి 10: కర్ణాటక కాంగ్రెస్లో అంతర్గత పోరు జరుగుతున్నట్లు జోరుగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో తనను తాను రక్షించుకునేందుకు హోమం నిర్వహించానని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం బెంగళూరులోని మల్లేశ్వరంలో గల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మనశ్శాంతి, ప్రశాంతత కోసం తాను పూజలు చేస్తానని చెప్పారు.
హోమాలు, యాగాలు, పూజలు చేయడం, రోజూ ఆలయాలను సందర్శించడం తనకు అలవాటని ఆయన చెప్పారు. శత్రువులను నాశనం చేయడానికి శివకుమార్ క్రతువులు జరిపించినట్టు కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి చేసిన ఆరోపణల గురించి విలేకరులు ప్రశ్నించగా తనకు మంచి జరగాలని కోరుతూ తాను రోజూ ప్రార్థనలు చేస్తానని డీకే చెప్పారు. తనను ఇబ్బంది పెట్టే వారి నుంచి రక్షణ ఇవ్వాలని ప్రార్థిస్తానని, ఇందులో దాచుకోవడానికి ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. మీరు ఇబ్బంది పెట్టినా మీ నుంచి కూడా రక్షణ కల్పించాలని ప్రార్థిస్తానని ఆయన విలేకరులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.