కోల్‌కతా: తనకూ కూతురు ఉందని, అందుకే డాక్టర్ హత్యాచార నిరసనలో తాను పాల్గొంటానని పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ సుఖేందు శేఖర్ రే తెలిపారు. (Women’s Protest) మహిళలపై క్రూరత్వాన్ని ఇకనైనా ముగించాలని అన్నారు. ఏం జరిగినా సరే కలిసికట్టుగా ప్రతిఘటిద్దామని పిలుపునిచ్చారు. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లోశుక్రవారం నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల మహిళా డాక్టర్‌పై అత్యాచారానికి పాల్పడటంతో పాటు హత్య చేయడంపై నిరసనలు వెల్లువెత్తాయి. ‘స్వాతంత్య్రం వచ్చిన అర్ధరాత్రి వేళ మహిళా స్వాతంత్య్రం కోసం’ పేరుతో బుధవారం అర్ధరాత్రి 11.55 గంటలకు భారీ నిరసన ర్యాలీకి బెంగాల్, కోల్‌కతా మహిళా సంఘాలు పిలుపునిచ్చాయి.
కాగా, సొంత పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపడుతున్న ఈ నిరసన ర్యాలీలో తాను కూడా పాల్గొంటున్నట్లు టీఎంసీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రే తెలిపారు. బెంగాల్‌లోని లక్షలాది కుటుంబాల్లో మాదిరిగా తనకు కుమార్తె, మనుమరాలు ఉన్నారని చెప్పారు. తాను తీసుకున్న ఈ నిర్ణయంతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక నిరసనలో పాల్గొంటే సుఖేందు శేఖర్ రేను తృణమూల్ కాంగ్రెస్ నుంచి తొలగించే అవకాశం ఉందన్న ఒక యూజర్ ప్రశ్నకు ఆయన స్పందించారు. ‘నా భవిష్యత్తు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్వాతంత్ర్య సమరయోధుడి రక్తం నా సిరల్లో ప్రవహిస్తోంది’ అని పేర్కొన్నారు.
Tomorrow I am going to join the protesters particularly because I’ve a daughter and little granddaughter like millions of Bengali families. We must rise to the occasion. Enough of cruelty against women. Let’s resist together. Come what may.
— Sukhendu Sekhar Ray (@Sukhendusekhar) August 13, 2024