కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఇవాళ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో ఓటింగ్ జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే కృష్ణనగర్‌లో ఇవాళ జరిగిన ఎన్నికల సభలో ప్రధాని మోదీ(PM Modi) పాల్గొని మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. పరిపాలన సరిగా లేని, బాధ్యత లేని ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఓటింగ్ జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. ఆ పార్టీ పాల్పడిన అవినీతి, అసమర్థత పట్ల ప్రజలు విసిగిపోయినట్లు ఆయన చెప్పారు. రికార్డు స్థాయిలో ఓటింగ్ జరుగుతోందని, ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని, మే 4వ తేదీన బీజేపీ విజయం ఖాయం అవుతుందని ప్రధాని తెలిపారు. ఇటీవల ఎన్నికల ప్రచారం సమయంలో జార్గ్రామ్లోని ఓ షాపుకు వెళ్లి జాల్ముడి(మురమురాల స్నాక్) తిన్నానని, కానీ మిరప ఘాటు మాత్రం టీఎంసికి తగిలినట్లు ప్రధాని మోదీ విమర్శించారు.
బెంగాల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరుగుతోందని, ఇది బీజేపీ గెలుపుకు సంకేతమని బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తన ఎక్స్‌లో తెలిపారు. బెంగాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 62.18 శాతం ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక తమిళనాడులో 56.81 శాతం ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రెండు రాష్ట్రాల్లోనే చాలా ఆసక్తికర రీతిలో ఓటింగ్ జరుగుతోందని ఆయన అన్నారు.