Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం యాన్యువల్ లీగల్ కాన్క్లేవ్లో పాల్గొన్నారు. రాహుల్ ప్రసంగం సభలో ఆయన మద్దతుదారులు నినదించారు. ‘ఇస్ దేశ్ కా రాజా కైసా హో.. రాహుల్ గాంధీ జైసా హో’ అని పలువురు నినదించగా దానికి రాహుల్ గాంధీ స్పందిస్తూ.. తాను రాజును కాదని.. కావాలని అనుకోవడం లేదన్నారు. అయినా పలువురు అలాగే నినాదాలు చేశారు. తాను రాజుగా మారాలని కూడా కోరుకోవడం లేదని.. తాను రాజును వ్యతిరేకిస్తున్నానని.. నేను ఆ భావనకు కూడా వ్యతిరేకినన్నారు. రాహుల్ గాంధీ గతంలో ప్రధానిని ఉద్దేశించి ‘రాజు’గా అభివర్ణిస్తూ ప్రజల గొంతుక వినడం లేదంటూ ఆరోపించారు.
‘రాజ్యాంగ సవాళ్లు : దృక్కోణాలు, మార్గాలు’ అనే థీమ్ వనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో లీగల్ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘంపై మరోసారి విమర్శలు గుప్పించారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ ఇప్పటికే చచ్చిపోయిందని మండిపడ్డారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని.. దాదాపు 70 నుంచి వంద స్థానాల్లో రిగ్గింగ్ జరిగి ఉండవచ్చన్నారు. ఒకవేళ 15 సీట్లలోనే రిగ్గింగ్ జరిగి ఉంటే మోదీకి ప్రధానిగా అవకాశమే లభించేది కాదన్నారు. స్వల్ప మెజారిటీతో మోదీ ప్రధాని పీఠాన్ని అలంకరించారన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఇంకా తక్కువగా సీట్లు వచ్చి ఉంటే ఆయన ప్రధాని పీఠం వరకు వెళ్లేవారు కాదన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని ఒక అసెంబ్లీ స్థానంలో ఉన్న ఓటర్ల ఫొటోలు, పేర్లను తమ పార్టీ తనిఖీ చేయగా మొత్తం 6.5 లక్షల ఓటర్లలోని 1.5 లక్షలలో ఓటర్లు నకిలీయేనని తేలిందని రాహుల్ తెలిపారు. ఈ సమాచారాన్ని కాంగ్రెస్ విడుదల చేశాక ఎన్నికల వ్యవస్థలో ప్రకంపనలు రావడాన్ని అందరూ చూస్తారన్నారు. ఆటం బాంబులా కుదిపేస్తుందన్న ఆయన.. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం కొందరి హస్తాల్లోకి వెళ్లిపోయిందని, దాని ఉనికే ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు.
గతంలో తగిన సాక్ష్యాధారాలు లేక ఈ అంశంపై మాట్లాడలేకపోయేవాడినన్నారు. తమ చేతలో ప్రస్తుతం వందశాతం సాక్ష్యాలు ఉన్నాయని.. అదే ధీమాతో ప్రస్తుతం మాట్లాడుతున్నానన్నారు. తాను లోక్‌సభ ఎన్నికల రిగ్గింగ్‌కు సంబంధించిన ఆధారాలను చూపిస్తే, కొందరు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారని.. అదెలా సాధ్యమైందని ప్రశ్నిస్తున్నారన్నారు. కానీ, అది సాధ్యమేనని.. నిజంగానే జరుగుతోందన్నారు. 2014 నుంచే తనకు అనుమానంగా ఉందన్నారు. అప్పటి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల విషయంలోనూ సందేహాలు ఉన్నాయన్నారు. పూర్తిగా మెజారిటీతో కొందరికి వచ్చినా ఏకపక్ష విజయాలు తనలో అనుమానాలు పెంచాయన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోనైతే కాంగ్రెస్‌కు ఒక్క లోక్‌సభ సీటు రాలేదని.. ఆయా ఆ ఫలితాలు తనను ఆశ్చర్యపరిచాయన్నారు.