Breast Cancer | న్యూఢిల్లీ, జనవరి 2: రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఐఐటీ గువాహటి పరిశోధకులు పురోగతి సాధించారు. ఇంజెక్ట్ చేయగల హైడ్రోజెల్‌ను వారు ఆవిష్కరించారు. సంప్రదాయ క్యాన్సర్ చికిత్సలతో పోలిస్తే దీని వల్ల చాలా తక్కువ సైడ్ఎఫెక్ట్స్ ఉండటం విశేషం. కోల్‌కతాలోని బోస్ ఇన్స్టిట్యూట్తో కలిసి ఐఐటీ గువాహటి పరిశోధకులు ఈ హైడ్రోజెల్‌ను అభివృద్ధి చేశారు. అధికారిక వర్గాలను ఉటంకిస్తూ రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీకి చెందిన మెటీరియల్ హారిజోన్స్ జర్నల్‌లో ఈ మేరకు కథనం ప్రచురితమైంది.
నీటి ఆధారిత త్రీ డైమెన్షనల్ నెట్‌వర్క్‌లనే హైడ్రోజెల్‌గా పిలుస్తున్నారు. ఫ్లూయిడ్స్లను గ్రహించి, అందులో నిలుపుకొనే సామర్థ్యం వీటికి ఉంటుంది. వీటి ప్రత్యేక నిర్మాణం జీవకణాలను అనుకరించేందుకు ఉపకరిస్తాయి. ప్రధానంగా క్యాన్సర్ నిరోధక డ్రగ్స్‌కు రిజర్వాయర్లా ఈ హైడ్రోజెల్ దోహదపడుతుంది. అంతేకాదు, అవసరమైన సమయంలో ఒక పద్ధతి ప్రకారం క్యాన్సర్ నిరోధక డ్రగ్స్‌ను విడుదల చేసి చికిత్స చేస్తుంది.
‘క్యాన్సర్ కణతులను శస్త్రచికిత్స ద్వారా తొలగించడం కొన్నిసార్లు సాధ్యపడదు. ముఖ్యంగా అంతర్గత అవయవాలకు చికిత్స చేసేటప్పుడు సమస్య ఎదురవుతుంది. కీమోథెరపీ చేస్తే క్యాన్సర్ కణాలతో పాటు ఆరోగ్యకరమైన కణాలపై కూడా ప్రభావం పడుతుంది. కానీ, ఈ హైడ్రోజెల్ ద్వారా నేరుగా క్యాన్సర్ కణాలకు చికిత్స చేసేందుకు ఆస్కారం ఉంటుంది’ అని పరిశోధనలకు నేతృత్వం వహించిన ఐఐటీ గువాహటి ప్రొఫెసర్ దేబప్రతీమ్ దాస్ తెలిపారు.