న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: విక్రమ్-1 రాకెట్ ప్రయోగానికి సిద్ధమవుతున్న హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ కీలకమైన విజయాన్ని సొంతం చేసుకుంది. విక్రమ్-1 రాకెట్ కోసం సిద్ధం చేసిన ‘కలాం-100’ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించింది. తాజా ప్రయోగంలో అధునాతన నాజిల్‌తో కలాం 100 ఇంజిన్ 102 సెకన్లపాటు మండించినట్టు సంస్థ ఓ ప్రకటనలో పేర్కొన్నది. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం మూడో స్టేజీని ‘కలాం-100’ ఇంజిన్‌తో చేపట్టనున్నారు.
ఈ నేపథ్యంలో ఇంజిన్ పనితీరుకు సంబంధించి అత్యంత కీలకమైన ‘స్టాటిక్ ఫైర్ టెస్ట్’ను స్కైరూట్ పూర్తిచేసుకుంది. ఆపరేటింగ్ ఏరియాలో గరిష్టంగా 100 కిలోన్యూటాన్ల పీడనాన్ని (శూన్యంలో) ఉత్పత్తి చేసినట్టు తెలిసింది. తద్వారా రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో స్కైరూట్ తన సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించింది. విక్రమ్ రాకెట్ అభివృద్ధిలో కీలకమైన ఓ మైలురాయిగా ఇది నిలవనున్నది. స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ మూడు వేరియెంట్లలో విక్రమ్ రాకెట్‌ను అభివృద్ధి చేస్తున్నది. విక్రమ్-1 రాకెట్ 480 కిలోల పేలోడ్‌ను తక్కువ ఎత్తులో ఉన్న భూ కక్ష్యలోకి మోసుకెళ్తుంది.