Caucasian Shepherd dog | జంతు ప్రేమికులు చాలా మందే ఉంటారు. అందులో మరి ప్రత్యేకంగా పెంపుడు కుక్కలను ఇష్టపడే వారు కూడా ఉంటారు. పెంపుడు కుక్కలను తమ సొంత బిడ్డల్లాగానే, అల్లారుముద్దుగా పెంచుకుంటుంటారు. ఈ క్రమంలో ఖరీదైన కుక్కలను కొనుగోలు చేసేందుకు కూడా వెనుకాడరు. మార్కెట్లోకి వచ్చే ప్రతి బ్రీడ్‌ను కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు.
బెంగళూరులోని కడబామ్స్ కెన్నెల్స్ ఓనర్, ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీశ్.. అరుదైన కుక్కను కొనుగోలు చేశారు. కాకాసియన్ షెపెర్డ్‌కు చెందిన కుక్కను రూ. 20 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ శునకాన్ని అమ్మిన వ్యక్తిది హైదరాబాద్. కాకాసియన్ షెపెర్డ్ వయసు 1.5 సంవత్సరాలు. దీనికి కడబామ్ హేడర్ అని నామకరణం చేశాడు. కడబామ్ హేడర్.. త్రివేండ్రమ్ కెన్నెల్ క్లబ్ ఈవెంట్, క్రౌన్ క్లాసిక్ డాగ్ షోలో పాల్గొంది. బెస్ట్ డాగ్ బ్రీడ్ కింద 32కి పైగా మెడల్స్ గెలుచుకుంది. హేడర్ జీవితకాలం 10 నుంచి 12 సంవత్సరాలు. 45 నుంచి 70 కిలోల వరకు బరువు ఉంటుంది.
తాజాగా కొన్న కాకాసియన్ షెపెర్డ్‌కు ధైర్యం, నమ్మకం ఎక్కువ. దేనికీ భయపడదు అని సతీశ్ తెలిపారు. అత్యంత తెలివైన జాతి కుక్క. ఇవి చాలా పెద్ద సైజు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏసీ వాతావరణంలో పెరుగుతుందన్నారు. ఈ శునకాన్ని ఫిబ్రవరి నెలలో ప్రజలకు పరిచయం చేస్తానని చెప్పుకొచ్చాడు. కడబామ్స్ కెన్నెల్స్ ఓనర్ ఇప్పటికే కొరియా దోస మస్తిఫ్స్ని రూ.1 కోటి పెట్టి కొన్నారు. అలాగే అలస్కాన్ మాలామ్యూట్ని రూ.8 కోట్లకు, టిబెటన్ మస్తిఫ్ని రూ.10 కోట్లకు కొన్నారు.