Bomb Threats | కారు బాంబు పేలుడుతో ఢిల్లీ నగరం ఒక్కసారిగా వణికిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో 20 మందికిపైగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుడు ఉగ్రకుట్రగా పోలీసులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇండిగో, ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్ కార్యాలయాలకు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయి. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, చెన్నై, తిరువనంతపురం, కోల్‌కతా ఎయిర్‌పోర్టులను బాంబులతో పేల్చేస్తామని బెదిరింపులు వచ్చాయి. దాంతో విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి తనిఖీలు చేపట్టారు. బుధవారం 3.30 గంటల సమయంలో బాంబులతో పేల్చేస్తామని ఐదు ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాలకు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి.
దాంతో ఆయా విమానాశ్రయాల్లో ముందు జాగ్రత్త చర్యగా అవసరమైన సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌ను అమలులోకి తీసుకువచ్చారు. ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు అనంతరం ఫేక్ బెదిరింపు మెయిల్‌గా తేల్చారు. అయితే, విమానాశ్రయాలలో భద్రతా తనిఖీలు చేయడంతో పాటు నిఘాను పెంచారు. ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో దేశవ్యాప్తంగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ అడ్వైజరీ జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈ బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. ఢిల్లీ ఉగ్రదాడి తర్వాత విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, మెట్రో నెట్‌వర్క్‌లతో సహా కీలక ప్రాంతాల్లో భద్రతను పెంచారు.
సీసీకెమెరాలతో నిఘాను పర్యవేక్షిస్తున్నారు. ఫరీదాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు వైద్యులతో సహా ఎనిమిది మందిని అరెస్టు చేసిన కొద్దిగంటల తర్వాత ఢిల్లీలో పేలుడు ఘటన చోటు చేసుకుంది. జైష్ ఎ మహమ్మద్, అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్‌తో సంబంధాలున్న కశ్మీర్, హర్యానా, యూపీలో విస్తరించి ఉన్న వైట్-కాలర్ టెర్రర్ మాడ్యూల్‌గా అభివర్ణించిన పోలీసులు.. 2,900 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రకోట, ఇండియా గేట్, కానిస్టిట్యూషన్ క్లబ్, గౌరీ శంకర్ ఆలయంతో పాటు ఢిల్లీలోని పలు స్థలాలను లక్ష్యంగా ఉగ్రకుట్రకు ప్లాన్ చేసినట్లుగా వెలుగులోకి వచ్చింది.