న్యూఢిల్లీ, డిసెంబర్ 3: దేశ విమానయానం ఆగమాగమైంది. సిస్టమ్ ఔటేజ్ కారణంగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతోసహా దేశవ్యాప్తంగా అనేక విమానాశ్రయాలలో చెక్-ఇన్ వ్యవస్థలు పనిచేయకపోవడంతో బుధవారం ఉదయం పలు విమాన సర్వీసుల్లో తీవ్ర జాప్యం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వీసులో ఔటేజ్ వల్ల చెక్-ఇన్ సిస్టమ్స్‌కు అవాంతరాలు ఏర్పడినట్లు వారణాసి విమానాశ్రయం వద్ద ప్రయాణికుల కోసం ఏర్పాటు డిస్ప్లే బోర్డులో వెల్లడించగా మైక్రోసాఫ్ట్ మాత్రం దీన్ని ఖండించింది. అదంతా తప్పుడు ప్రచారంగా తోసిపుచ్చింది. అయితే వారణాసి విమానాశ్రయంలోని డిస్ప్లే బోర్డులో చెక్-ఇన్, బోర్డింగ్ ప్రక్రియను మాన్యువల్‌కు ఎయిర్‌లైన్స్ మార్చినట్లు పేర్కొన్నారు.
ఇండిగో, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ వంటి నాలుగు ఎయిర్‌లైన్స్ మాన్యువల్ పద్ధతికి మారినట్లు కూడా డిస్ప్లేలో తెలిపారు. కాగా మైక్రోసాఫ్ట్ మాత్రం తమ విండోస్‌లో ఔటేజ్ లేదని స్పష్టం చేసింది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆలస్యంగా రావడం వల్ల నాలుగు విమానాల డిపార్చర్ ఆలస్యమైంది. నిర్వహణ కారణాల రీత్యా అనేక ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. కొన్ని డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ నిర్వహణ సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ(డయల్) బుధవారం ఉదయం ఎక్స్‌లో పోస్టు చేసింది. దీని వల్ల విమాన సర్వీసుల్లో ఆలస్యం, రద్దు జరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. విమానాశ్రయాలలో పరిస్థితి చక్కబడినట్లు కొన్ని ఎయిర్‌లైన్స్ బుధవారం సాయంత్రం ప్రకటించాయి. థర్డ్-పార్టీ సిస్టమ్ పూర్తిగా పునరుద్ధరణ అయినట్లు ఎయిరిండియా ఎక్స్‌లో పేర్కొంది.
వివిధ కారణాల వల్ల దేశవ్యాప్తంగా 85కుపైగా విమానాలు రద్దు కావడంతో ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరింది. విమాన సర్వీసలను ఇండిగో బుధవారం రద్దు చేయడంతో అనేక విమానాశ్రయాలలో సంక్షోభం ఏర్పడింది. సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యలు, ఎయిర్‌పోర్టులలో రద్దీ వంటి కారణాలు విమానాల రద్దుకు దారితీసినట్లు ఇండిగో పేర్కొంది. వేలాదిమంది ప్రజలకు అసౌకర్యం ఏర్పడడంతో వారి నుంచి ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి వస్తుందన్న ముందు జాగ్రత్తతతో ఇండిగో వారిని క్షమాపణలు కోరింది.
విమాన సర్వీసులు రద్దు కావడంతో విమానాశ్రయాలలో ప్రయాణికులు ఆగ్రహంతో సిబ్బందిని నిలదీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును ట్యాగ్ చేస్తూ పలువురు నెటిజన్లు ఎక్స్ వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 7 గంటలకు పైగా చిక్కుకుపోయిన ఓ ప్రయాణికుడు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తీవ్ర గందరగోళం తలెత్తినట్లు ఎక్స్‌లో పేర్కొన్నాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు 12 గంటలకు పైగా ఎటువంటి కన్ఫర్మేషన్ లేకుండా పడిగాపులు పడుతున్నారని, ఇండిగో సిబ్బంది అబద్ధాలు చెబుతూ జలగల్లా పీడిస్తున్నారని విమర్శించారు.
ఇండిగో ఎయిర్‌లైన్స్ పనితీరును డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బుధవారం ప్రశ్నించింది. నవంబర్‌లో 1,232 విమానాలు రద్దవడంతోపాటు విమానాల రాకపోకల సమయాల్లో జాప్యం జరిగింది. ఈ పరిస్థితిపై దర్యాప్తు చేస్తున్నట్లు డీజీసీఏ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు జరుగుతున్న అసౌకర్యాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గించేందుకు చేపట్టవలసిన చర్యల గురించి ఇండిగోతో కలిసి మదింపు చేస్తున్నట్లు తెలిపింది.
శంషాబాద్ రూరల్,డిసెంబర్ 3: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమనాశ్రయం నుంచి వివిధ ఎయిర్‌పోర్టులకు వెళ్లాల్సిన 19 విమానాలు, వివిధ ఎయిర్‌పోర్టుల నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన 21 విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు బుధవారం తెలిపారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు ఎయిర్‌పోర్టులో తలెత్తిన సాంకేతిక సమస్యతో వీటిని రద్దు చేశామన్నారు. విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివిధ విమానయాన సంస్థల అధికారులు, ఎయిర్‌పోర్టు అధికారులు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కారించి విమానాలను సకాలంలో నడపాలని పలువురు కోరారు.