ముంబై: ఢిల్లీ, ముంబైకి వెళ్లే విమాన సర్వీసులలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ఇస్తాంబుల్ విమానాశ్రయంలో వందలాది మంది ఇండిగో ఎయిర్‌లైన్స్‌కి చెందిన ప్రయాణికులు చిక్కుకుపోయారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఇండిగో ఎయిర్‌లైన్స్ క్షమాపణ చెప్పింది. అయితే ఆలస్యానికి కారణాన్ని మాత్రం వివరించలేదు.
ఢిల్లీ, ముంబై నుంచి ఇస్తాంబుల్‌కు ప్రతి రోజు చెరో బోయింగ్ 777 విమానాన్ని ఇండిగో నడుపుతోంది. విమానాల ఆలస్యానికి కచ్ఛితమైన కారణాన్ని ఎయిర్‌లైన్స్ ప్రకటించలేదు. అయితే ప్రమాణికులు మాత్రం 24 గంటలకు పైగా జరుగుతున్న ఆలస్యంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇస్తాంబుల్ విమానాశ్రయంలో సరైన సౌకర్యాలు లేవని, గురువారం నుంచి తామంతా విమానాశ్రయంలోనే చిక్కుకుపోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆహారం లేదు. స్పష్టమైన సమాచారం లేదు. ఏ ప్రతినిధి రాడు. నష్టపరిహారం లేదు. దుర్భరమైన పిరిస్థితి అని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు.