Jumping Genes | హైదరాబాద్, ఫిబ్రవరి 29 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): మనిషి కోతి నుంచి వచ్చాడని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. కోతులకు తోకలు ఉండటం ఇప్పుడు కూడా చూస్తున్నాం. అయితే, వాటి నుంచే వచ్చిన మనుషులకు మాత్రం తోకలు లేవు. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇదే విషయంపై గత కొంతకాలంగా లోతైన పరిశోధనలు చేశారు. ఎట్టకేలకు ‘తోక’ రహస్యాన్ని ఇటీవల కనిపెట్టారు. వారి పరిశోధన ప్రకారం.. 2.5 కోట్ల సంవత్సరాల క్రితం వరకూ కోతులకు ఉన్నట్టే మనుషులకు కూడా తోకలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, కాలక్రమేణా మనుషులు, ఏప్స్ (గొరిల్లా)లలో తోకలు క్రమంగా కనుమరుగైనట్టు గుర్తించారు.
డీఎన్ఏలో కొత్తగా చేరిన ఏఎల్యూవై (జంపింగ్ జీన్స్ అని కూడా పిలుస్తారు) అనే ప్రత్యేక జన్యువుల కారణంగానే మనుషుల్లో తోకలు పెరుగడం నిలిచిపోయిందని, ఇదేసమయంలో జంపింగ్ జీన్స్ లేకపోవడంతో కోతులు, ఎలుకలు, పిల్లుల వంటి జీవుల్లో తోకలు పెరుగడం అలాగే కొనసాగుతున్నట్టు వివరించారు. అయితే, మనుషుల్లో జంపింగ్ జీన్స్ చేరడానికి గల కారణాలను కనుగొనాల్సి ఉన్నట్టు వెల్లడించారు. న్యూరల్ ట్యూబ్ లోపాల వల్ల జనన సమయంలోనే కేంద్ర నాడీ వ్యవస్థలో లోపాలు ఏర్పడతాయని పరిశోధనలో కనుగొన్నారు. ఈ లోపాలు కూడా కాకతాళీయంగా తోకలు కోల్పోయిన సమయంలోనే జరిగి ఉంటాయని భావిస్తున్నారు.
ఒక్కో జీవి తోక పొడవులో తేడా ఎందుకు ఉందన్న అంశంపై కూడా పరిశోధకులు అధ్యయనం చేశారు. డీఎన్ఏలో టీబీఎక్స్‌టీ అనే జన్యువుల మోతాదును బట్టి ఒక్కో జీవి తోక సైజులో మార్పు జరుగుతున్నట్టు వాళ్లు గుర్తించారు.
పరిశోధనలో భాగంగా అప్పుడే పుట్టిన 63 ఎలుకలను తీసుకొన్న శాస్త్రవేత్తలు వాటిలోకి జంపింగ్ జీన్స్‌ను క్రమంగా ప్రవేశపెట్టారు. ఎలుకలు పెరుగుతున్న క్రమంలో వాటి తోకలు చిన్నగా మారిపోవడం అనంతరం శరీరంలో కలిసిపోవడం జరిగినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.