Israel | టెల్ అవీవ్: గాజా స్ట్రిప్‌లోకి అన్ని రకాల సరుకులు, సరఫరాల రవాణాను ఇజ్రాయెల్ ఆదివారం నిలిపేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు చేసిన కొత్త ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని హమాస్ ఉగ్రవాద సంస్థను డిమాండ్ చేసింది. దీనికి అంగీకరించకపోతే మరిన్ని పర్యవసానాలను ఎదుర్కొనాలని హెచ్చరించింది. దీనిపై హమాస్ స్పందిస్తూ, కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కదోవ పట్టించేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నదని ఆరోపించింది. సామగ్రిని గాజా స్ట్రిప్‌లోకి ప్రవేశించనీయకుండా అడ్డుకోవడం నాసిరకం దోపిడీ అని, యుద్ధ నేరమని ఆగ్రహం వ్యక్తం చేసింది.
గాజాలో కాల్పుల విరమణ పొడిగింపు
గాజాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని తాత్కాలికంగా పొడిగించినట్లు ఇజ్రాయెల్ ఆదివారం ప్రకటించింది. ప్రధాని నెతన్యాహూ ఆఫీస్ ప్రకటన ప్రకారం, హమాస్ ఉగ్రవాద సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో తొలి దశను తాత్కాలికంగా పొడిగించింది. రంజాన్, యూదుల పాస్ఓవర్ సందర్భంగా, అనుసంధాన చర్యగా కాల్పుల విరమణను తాత్కాలికంగా పొడిగించింది. ఇదిలావుండగా, ఈ ఒప్పందంలోని తొలి దశను పొడిగించడాన్ని హమాస్ అనేకసార్లు తిరస్కరించింది.