ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రముఖ లీలావతి హాస్పిటల్ (Lilavati Hospital)లో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. సుమారు రూ.1250 కోట్ల మేర నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు జరుగుతున్నది. అయితే హాస్పిటల్లో చేతబడి జరిగినట్లు ట్రస్టీలు తాజాగా ఆరోపించారు. మానవ ఎముకలు, పుర్రెలు, వెంట్రుకలు, బియ్యం వంటి క్షుద్రపూజలకు సంబంధించిన వాటిని ఎనిమిది కుండల్లో గుర్తించినట్లు పేర్కొన్నారు. మాజీ ఉద్యోగుల సమాచారం ఆధారంగా తవ్వకాలు జరుపగా ఇవి బయటపడినట్లు తెలిపారు. ప్రస్తుత ట్రస్టీల కార్యాలయం అంతస్తు కింద వాటిని పాతిపెట్టారని ఆరోపించారు.
కాగా, లీలావతి హాస్పిటల్ వ్యవస్థాపకుడు కిషోర్ మెహతా సోదరుడైన విజయ్ మెహతా, అతడి బంధువులు, సహచరులు సహా మాజీ ట్రస్టీలపై ఆర్థిక దుర్వినియోగం ఆరోపణలకు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయి. అలాగే పన్ను ఎగవేత, దొంగతనం వంటి ఫిర్యాదులు కూడా మాజీ ట్రస్టీలపై నమోదయ్యాయి.
మరోవైపు ప్రస్తుత ట్రస్టీలైన ప్రశాంత్ మెహతా, ఆయన తల్లి చారు మెహతాకు హాని కలిగించడానికి మాజీ ట్రస్టీలు చేతబడి పద్ధతులు ఉపయోగించినట్లు ఆధారాలతో సహా తాజాగా ఫిర్యాదు చేశారు. దీంతో మహారాష్ట్ర యాంటీ బ్లాక్మ్యాజిక్ చట్టం కింద మరో కేసు నమోదైంది.
అయితే ఈ ఆరోపణలను మాజీ ట్రస్టీలు తిరస్కరించారు. నిరాధారమైనవి, దురుద్దేశపూరితమైనవి అని పేర్కొన్నారు. చేతబడి, క్షుద్రపూజల ఆరోపణలను మాజీ ట్రస్టీ విజయ్ మెహతా కుమారుడైన చేతన్ మెహతా ఖండించారు. సంచలనం సృష్టించేందుకు ప్రస్తుత ట్రస్టీలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
కాగా, లీలా హాస్పిటల్స్ వ్యవస్థాపక ట్రస్టీ కిషోర్ మెహతా 2002లో వైద్యం కోసం విదేశాలకు వెళ్లారు. ఆ సమయంలో సోదరుడు విజయ్ మెహతాకు తాత్కాలికంగా ట్రస్ట్ బాధ్యతలు అప్పగించారు. అయితే తన కుమారుడు, బంధువులను ట్రస్టీలుగా నియమించేందుకు విజయ్ మెహతా ఫోర్జరీ సంతకాలతో నకిలీ పత్రాలు సృష్టించారని, ఆ తర్వాత కిషోర్ మెహతాను శాశ్వత ట్రస్టీగా తొలగించినట్లు ఆరోపణలున్నాయి.
మరోవైపు ఇది సుదీర్ఘ న్యాయ పోరాటానికి దారితీసింది. 2016లో కిషోర్ మెహతా తిరిగి తన పదవిని చేపట్టడంతో ఈ వివాదం ముగిసింది. 2024లో కిషోర్ మెహతా మరణం తరువాత ఆయన కుమారుడు ప్రశాంత్ మెహతా శాశ్వత ట్రస్టీ అయ్యారు. అనంతరం ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టారు. దీంతో నిధుల దుర్వినియోగంతోపాటు సుమారు రూ.1500 కోట్ల మేర ఆర్థిక అవకతవకలు బయటపడటంతో మాజీ ట్రస్టీలపై కేసులు నమోదయ్యాయి.