శబరిమల: శబరిమలకు (Sabarimala) అయ్యప్ప భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. పెద్ద సంఖ్యలో మాలధారులు రావడంతో స్వామివారి దర్శనానికి 10 గంటల సమయం పడుతున్నది. సన్నిధానం నుంచి పంబ వరకు అయ్యప్ప భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. మండల పూజ ప్రారంభం కావడంతో శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ట్రావెన్కోర్ ఆలయ కమిటీ తగిన ఏర్పాట్లు చేస్తున్నది.
ఇప్పటికే అయ్యప్ప దర్శనాల కోసం టైమ్ స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేసిన దేవస్థానం కమిటీ.. దర్శన సమయాన్ని 18 గంటలకు పొడిగించింది. అదేవిధంగా వర్చువల్ క్యూ బుకింగ్స్‌ను ప్రారంభించింది. వర్చువల్ దర్శనానికి తొలిరోజే 30వేల మంది భక్తులు టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఈ ఏడాది నిత్యం 80 వేల మందికి దర్శనాలు కల్పిం చాలని నిర్ణయించారు. అయితే ఇందులో 70 వేల మందికి ఆన్లైన్లో వర్చువల్ క్యూ టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించగా.. మరో 10 వేల మందికి శబరిమలలోనే 3 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో టికెట్లు అందించనున్నారు.