టొరొంటో, నవంబర్ 5: హిందువులపై ఖలిస్థాన్ వేర్పాటువాదుల దాడి కెనడాను కుదిపేస్తున్నది. బ్రాంప్టన్ ఘటనపై కెనడాలోని హిందువులు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఖలిస్థాన్ వేర్పాటువాదుల దుశ్చర్యలను ఖండిస్తూ సోమవారం బ్రాంప్టన్ నగరంలో హిందువులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. హిందువులకు వ్యతిరేకంగా కెనడాలో హింస పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది హిందువులు భారత త్రివర్ణ పతాకాలను, కాషాయ జెండాలను ప్రదర్శిస్తూ ఈ నిరసనలో పాల్గొన్నారు. ఒంటారియా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువులు బ్రాంప్టన్‌లోని గోరే రోడ్ కూడలి వద్దకు తరలివచ్చారు. కాగా, నిరసనను కెనడా పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకు అనుమతులు లేవని పేర్కొన్నారు. ఖలిస్థాన్ వేర్పాటువాదానికి, ట్రూడో సర్కార్‌కు వ్యతిరేకంగా హిందువులు నినాదాలు చేశారు. ఘటన పట్ల ట్రూడో సర్కార్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.