ముంబై, నవంబర్ 9: మహారాష్ట్రలో మరో భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. గత కొద్ది రోజుల్లో ఇది మూడో భూ కుంభకోణం. బీజేపీ-శివసేన కూటమి ప్రజా ధనాన్ని దోపిడీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. కూటమి పార్టీల బలంపై ఆధారపడి పాలన సాగిస్తున్న బీజేపీ ప్రభుత్వం మిత్రపక్ష పార్టీల నేతలు, వారి కుమారులు యథేచ్ఛగా భూ దోపిడీకి పాల్పడుతుంటే తన వంతు సహకారం అందిస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు. పుణె సమీపంలోని ముండ్వా వద్ద రూ.1800 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్‌కు చెందిన అమెడియా ఎంటర్‌ప్రైజస్‌కు ప్రభుత్వం రూ.300 కోట్లకే విక్రయించినట్టు తీవ్ర ఆరోపణలు రాగా, ఇప్పుడు తాజాగా, అదే అమెడియా హోల్డింగ్స్ కంపెనీ బోపోడి ప్రాంతంలో ఒక భారీ భూ కుంభకోణానికి పాల్పడింది.
వ్యవసాయ శాఖకు చెందిన భూమిని ఆ కంపెనీ స్వాధీనం చేసుకుని, తహసీల్దార్‌తో కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించిన సంగతి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో అమెడియా కంపెనీ డైరెక్టర్ దిగ్విజయ్ అమర్‌సింగ్ పాటిల్ సహా 9 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కుంభకోణంపై నాయిబ్ తహసిల్దార్ ప్రవీణ్ శశికాంత్ బోర్డే (50) ఖాడక్ పోలీస్ స్టేషన్లో ప్రభుత్వం తరపున ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ కుంభకోణం జరిగిన స్థలం మామ్లత్థార్ కలెక్టరేట్ ఛత్రపతి శివాజీ రోడ్లో ఉండగా, 2024 ఫిబ్రవరి 12 నుంచి 2025 జూలై 1 మధ్య ఇది జరిగినట్టు భావిస్తున్నారు.
పుణెలోని ముంద్వారా ప్రాంతంలో రూ.1800 కోట్ల విలువ చేసే 40 ఎకరాల ప్రభుత్వ భూమిని మహారాష్ట్ర ప్రభుత్వం అజిత్ పవార్ కుమారుడి కంపెనీకి రూ.300 కోట్లకే కేటాయించడమే కాక, స్టాంప్ డ్యూటీని కూడా రద్దు చేసింది. వందల కోట్ల రూపాయల విలువైన భూమికి రూ.500 మాత్రమే స్టాంప్ డ్యూటీగా వసూలు చేశారంటే దీనిలో ప్రభుత్వ ప్రమేయం, సహకారం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే వందల కోట్ల రూపాయల భూ కుంభకోణంలో తన కుమారుడి పాత్ర గురించి బయటపడటంతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బురద కడుక్కోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశమైన ఆయన ఆ భూమి ఒప్పందాన్ని రద్దు చేసినట్టు ప్రకటించి చేతులు దులుపేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ భూమికి సంబంధించి ఒక్క రూపాయి వ్యవహారం కూడా జరగలేదని, భూమి స్వాధీనం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో అనవసరంగా తన కుటుంబం పరువు తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాగా, మహారాష్ట్రలో మీరా భయందర్‌లోని రూ.200 కోట్ల విలువైన నాలుగు ఎకరాల భూమిని మహారాష్ట్ర మంతి ప్రతాప్ సర్నాయక్ తన సొంత విద్యాసంస్థ కోసం రూ.3 కోట్లకే ప్రభుత్వం నుంచి అక్రమంగా పొందిన విషయం వెలుగులోకి వచ్చింది.
ఇది చాలా తీవ్రమైన విషయం. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా ఇది తీవ్రమైనదేనని అన్నారు. కాబట్టి దీనిపై దర్యాప్తు జరగాలి. ప్రజలకు నిజానిజాలు తెలియాలి.
– శరద్ పవార్, ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్.
ఈ భూ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో మిగిలిన వారి పాత్ర గురించి బయటపడితే వారిపై కూడా కేసులు నమోదు చేస్తాం. ఎవరినీ వదలం. వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం.
– ఫడ్నవీస్, ముఖ్యమంత్రి, మహారాష్ట్ర.
మీరు ప్రజాస్వామ్యం గురించి, ప్రజల గురించి, దళిత హక్కుల గురించి పట్టించుకోరు. మోదీ.. మీ మౌనం చాలా విషయాలు చెబుతున్నది. ఎందుకంటే భూ ఆక్రమణదారులు, దళితులు, పీడిత ప్రజల హక్కులను అపహరించే పార్టీలపై మీ ప్రభుత్వం ఆధారపడి ఉంది.
– రాహుల్, కాంగ్రెస్ నేత