న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఢిల్లీ రోహిణిలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ స్కూల్ వెలుపల ఆదివారం ఉదయం 7.50 గంటలకు భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఈ పేలుడుతో పాఠశాల గోడ దెబ్బతినగా, చుట్టుపక్కల దుకాణాలు, ఇండ్లు, ఒక కారు స్వల్పంగా ధ్వంసమైంది. పేలుడు తర్వాత ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. బాంబు స్కాడ్, పోలీసులు, ఎన్ఐఏ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. నాటు బాంబు కారణంగా ఈ పేలుడు సంభవించి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలి నుంచి తెల్లటి పొడి, మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్‌కు పంపారు.
అండర్‌వరల్డ్ డాన్ల శకంలా.. ఢిల్లీ
పేలుడుపై ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ తీవ్రంగా స్పందించారు. ఈ పేలుడు ఢిల్లీలో దిగజారిన శాంతిభద్రతలను సూచిస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఢిల్లీలోని శాంతి భద్రతల పర్యవేక్షణ బాధ్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదేనని, అయితే దానిని మరచిన ప్రభుత్వం అధికారంలోని ఆప్ ప్రభుత్వాన్ని ఎలా ఇబ్బంది పెట్టాలా అని నిత్యం ఆలోచిస్తున్నదని విమర్శించారు. ఒకప్పుడు అండర్‌వరల్డ్ శకంలో ముంబై ఎలా ఉండేదో, ఇప్పుడు ఢిల్లీలో అలాంటి పరిస్థితులు ఉన్నాయని అన్నారు.