న్యూఢిల్లీ, మార్చి 26: కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా తమ వద్ద ఉన్న స్టాక్స్‌ను తగ్గించుకోవడానికి ఆఫర్లను తెరపైకి తీసుకొస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు లక్షల స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలను కల్పించగా..తాజాగా ఈ జాబితాలోకి రెనో ఇండియా కూడా చేరింది.
పలు ఎంపిక చేసిన మాడళ్లపై రూ.80 వేల వరకు తగ్గింపు ధరతో అందిస్తున్నది. వీటిలో ట్రైబర్, కైగర్, క్విడ్ మాడళ్లు ఉన్నాయి. ఈ మూడు మాడళ్లను కొనుగోలు చేసిన వారికి నగదు డిస్కౌంట్‌తోపాటు ఎక్సేంజ్ బోనస్, లాయల్టీ బెనిఫిట్స్ కింద రూ.80 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చునని కంపెనీ వెల్లడించింది. వీటిలో ట్రైబర్, కైగర్‌లపై రూ.80 వేల వరకు ప్రయోజనాలు కల్పించనున్న సంస్థ..క్విడ్‌పై రూ.70 వేలు ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చునని తెలిపింది. వీటిలో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన క్విడ్ మాడల్ కూడా ఉన్నది.