డెహ్రాడూన్: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హిజాబ్ అంశంపై చర్చ జరుగుతున్నది. ముస్లిం విద్యార్థినులు క్లాస్‌లో హిజాబ్ ధరించడాన్ని బీజేపీ, దాని అనుబంధ హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధికారంలో ఉన్న అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కొత్త లాజిక్‌ను తెరపైకి తెచ్చారు. ముస్లిం విద్యార్థిని హిజాబ్ ధరించినట్లయితే, పాఠం అర్థమైందా లేదా అన్నది ఉపాధ్యాయులకు ఎలా తెలుస్తుంది? అని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం కోసం శుక్రవారం ఆయన వచ్చారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు. క్లాస్‌లో హిజాబ్ ధరిస్తామని మూడేండ్ల కిందట ఎవరూ అనలేదన్నారు. ముస్లిం సమాజానికి విద్యే అవసరమని, హిజాబ్ కాదన్నారు.
కర్ణాటక ఘటనతో దేశం అల్లాడిపోతోందని, దీనికి కాంగ్రెస్ పార్టీనే కారణమని సీఎం హిమంత బిస్వా శర్మ విమర్శించారు. దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్న తీరు ఆందోళనకరమని అన్నారు. అది ‘తుక్డే తుక్డే’ గ్యాంగ్‌కు ప్రాతినిధ్యం వహిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఒక్కటేనని, 1947కు ముందున్న పరిస్థితిని పునరావృతం చేయాలని ఆ పార్టీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.
దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దడంపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారని హిమంత బిస్వా శర్మ తెలిపారు. అయితే ఇతరులు మాత్రం హిజాబ్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని కాంగ్రెస్ ప్రశ్నించిందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ బుజ్జగింపు రాజకీయాల కోసం ఇక్కడకు వచ్చారని, దేశం కోసం కాదని ఆరోపించారు. ప్రధాని మోదీ మాత్రం దేశం కోసమే జీవిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
#WATCH | How would a teacher know if a student is understanding or not, if they're wearing a hijab? No one said they wanted to wear a hijab 3 yrs ago?… Muslim community needs education, not hijab… Political Islam is Congress sponsored: Assam CM Himanta Biswa Sarma#HijabRow pic.twitter.com/SZmUeTdqn9
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 11, 2022