How To Reach Ayodhya | అయోధ్య రామ మందిరంలో బాల రాముడు దర్శనం ఇవ్వనున్నారు. అభిజిత్ ముహూర్తంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. సోమవారం జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి అతిథులు తరలివస్తున్నారు. శాంతిభద్రతల నేపథ్యంలో 22న అయోధ్యకు వచ్చేందుకు ప్రయత్నం చేయొద్దని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆ రోజున ప్రతి ఒక్కరూ ఇంటి వద్దనే దీపావళిని జరుకొని.. రామజ్యోతిని వెలిగించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 23 నుంచి సాధారణ ప్రజలకు అయోధ్య ఆలయంలో దర్శనాలు కల్పించనున్నారు. ఈ క్రమంలో ఆలయానికి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రైల్వే స్టేషన్, విమానాశ్రయం, కొత్త బస్స్టేషన్లను సైతం నిర్మించి ప్రారంభించారు. రామ మందిరాన్ని సందర్శించడానికి అయోధ్యకు ఎలా చేరుకోవచ్చు తెలుసుకుందాం..!
ఉత్తరప్రదేశ్‌లో అయోధ్య రామాలయం ఉన్నది. సరయూ నది తూర్పు ఒడ్డున ఉన్న అయోధ్య నగరం రాజధాని లక్నో నుంచి 134 కిలోమీటర్ల దూరంలో ఉంది. రామ మందిరంతో పాటు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ఇందులో హనుమాన్ గర్హి, రామ్‌కోట్, నాగేశ్వరనాథ్ ఆలయం, కనక్ భవన్, తులసి స్మారక్ భవన్, త్రేతా కే ఠాకూర్, జైన్ టెంపుల్, మణి పర్వతం, ఛోటీ దేవ్‌కలి టెంపుల్, రామ్ కీ పైడి, సరయూ నది, క్వీన్ హో మెమోరియల్ పార్క్, గురుద్వారా, సూరజ్ కుండ్, గులాబ్, బారి బహు-బేగం సమాధి, కంపెనీ గార్డెన్, గుప్తర్ ఘాట్ ఉన్నాయి.
అయోధ్య అనేక ప్రధాన నగరాలు, పట్టణాలకు రోడ్డు మార్గం ఉన్నది. అయోధ్య నుంచి లక్నో వరకు 134 కిలోమీటర్లు. ప్రయాగ్‌రాజ్ నుంచి 166 కిలమీటర్ల దూరంలో ఉన్నది. వారణాసి నుంచి 209 కిలోమీట్ల దూరం ఉన్నది. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో యూపీ రోడ్‌వేస్ పర్యాటకుల కోసం ప్రత్యేకంగా సన్నాహాలు చేపట్టింది. యూపీలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సులను ఏర్పాటు చేసింది. మధుర, చిత్రకూట్, ఆగ్రా, ఢిల్లీ సహా ఇతర మార్గాల నుంచి సైతం బస్సులు నడవనున్నాయి. ప్రస్తుతం పొగమంచు కారణంగా బస్సుల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. జనవరి 14 నుంచి అయోధ్యలో వంద ఈ-బస్‌లను ప్రారంభించారు.ఈ బస్సులు సలార్పూర్, సహదత్‌గంజ్, విమానాశ్రయం, హైవే, రాంపత్, ధర్మపత్లలో నడుస్తాయి. దర్శన్‌నగర్, కత్రా, అయోధ్య కాంట్ రైల్వే స్టేషన్ల నుంచి కూడా ఈ-బస్సులు నడుస్తాయి. రైళ్ల టైమ్ టేబుల్‌ను బట్టి బస్సుల సమయాన్ని ఖరారు చేశారు.
అయోధ్య ఉత్తర రైల్వేలో మొఘల్ సరాయ్-లక్నో ప్రధాన మార్గంలో ఉంది. అనేక రైళ్ల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు. అయోధ్యలో రామ మందిరానికి 800 మీటర్ల దూరంలోనే రైల్వే స్టేషన్ ఉంది. అయోధ్యలో పునరుద్ధరించిన రైల్వే స్టేషన్‌ను ఇటీవలే ప్రధాని మోదీ ప్రారంభించారు. దీనికి ‘అయోధ్య ధామ్’ పేరు పెట్టారు. రామ మందిర ప్రారంభోత్సవానికి ముందే నగరానికి అనేక రైలు సేవలు ప్రారంభమయ్యాయి. త్వరలో మరికొన్ని ప్రారంభంకానున్నాయి. గత శనివారం అయోధ్య ధామ్ స్టేషన్ నుంచి ఆనంద్ విహార్ వరకు వందే భారత్‌ను జెండా ఊపి ప్రధాని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి అయోధ్యకు రైళ్లు నడువనున్నాయి. ఇప్పటికే రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను సైతం ప్రకటించింది. సికింద్రాబాద్ – అయోధ్య మధ్య ప్రత్యేక రైళ్లు సైతం నడువనున్నాయి. అలాగే గుంటూరు, విజయవాడ నుంచి సైతం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
దేశంలోని వివిధ నగరాల నుంచి అయోధ్యకు విమానాలు నడువనున్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ విమానాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. గతవారం ప్రధాని నరేంద్ర మోదీ మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించగా.. ఇప్పటికే రాకపోకలు మొదలయ్యాయి. ముంబయి, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా సహా పలు నగరాల నుంచి విమానాల షెడ్యూల్ ఖరారైంది. త్వరలోనే మరికొన్ని నగరాల నుంచి విమానాలు నడువనున్నాయి.
కాశీ-అయోధ్య మధ్య హెలీకాప్టర్ సర్వీస్ ప్రారంభం కానున్నది. దీంతో ఒకేరోజు రామ్‌లల్లా.. కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేదార్నాథ్, వైష్ణో దేవి తరహాలో అయోధ్య, వారణాసి మధ్య హెలికాప్టర్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం వారణాసిలో మూడు, అయోధ్యలో రెండు హెలీప్యాడ్లను సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. వారణాసిలో అత్యవసర ల్యాండింగ్ కోసం మరో హెలీప్యాడ్‌ను సైతం సిద్ధం చేశారు.