న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలన్న అంశంపై దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టులో గత కొన్ని రోజులుగా వాదనలు జరుగుతున్న విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేపథ్యంలోని ధర్మాసనం ఆ పిటీషన్లపై విచారణ కొనసాగిస్తోంది. సేమ్ సెక్స్ జంటకు ప్రామాణికమైన సామాజిక హక్కుల్ని కల్పించే విషయంలో ప్రభుత్వం ఏదో ఒక మార్గాన్ని కనుగొనాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. గే జంటలకు జాయింట్ బ్యాంక్ అకౌంట్లు కల్పించడం, బీమా పాలసీల్లో భాగస్వామిని నామినేట్ చేసే అంశాలపై ప్రభుత్వం స్పష్టతను ఇవ్వాలని కోర్టు తెలిపింది.
అయితే స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే విషయంలో పార్లమెంట్ తీర్మానమే కీలకమన్న అంశాన్ని అంగీకరిస్తున్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది. సేమ్ సెక్స్ కపుల్స్‌కు వివాహ చట్టబద్దత కల్పించకుండా.. వాళ్ల సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ఇలాంటి అంశాలపై ప్రభుత్వ వివరణ కావాలని సొలిసిటర్ జనరల్‌ను కోర్టు ఆదేశించింది. వచ్చే బుధవారం ఆ వివరణలతో కోర్టుకు రావాలని సీజేఐ చంద్రచూడ్ ఆదేశించారు.