న్యూఢిల్లీ, ఆగస్టు 8 : అమెరికా బెదిరింపులకు భయపడి రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకోవడం నిలిపివేస్తే భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేర్కొంది. ఇప్పటినుంచి ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) మొత్తం రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేసి ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తే.. అదనంగా తొమ్మిది బిలియన్ డాలర్లు (సుమారు రూ.7.9 లక్షల కోట్లు) ఖర్చు పెరుగుతుందని అంచనా వేసింది.
ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకపోతే మరో 11.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10.25 లక్షల కోట్ల) వ్యయం పెరుగుతుందని తెలిపింది. రష్యా నుంచి చమురుతో ఇతర వస్తువులు కొనుగోలు చేస్తున్నందుకు గాను అమెరికా మన దేశంపై మరో 25 శాతం సుంకాలను పెంచిన సంగతి తెలిసిందే. ఒకవేళ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేస్తే కలిగే ప్రభావంపై ఎస్బీఐ అధ్యయనం చేసింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత భారత్‌పై సుంకాలను 50 శాతం పెంచారు.
భారత్ 2022 అనంతరం రష్యా చమురుపై అధికంగా ఆధారపడటం ప్రారంభించింది. 2020-21లో రష్యా నుంచి చమురు దిగుమతులు 1.7 శాతం ఉండగా, అది 2025-26 నాటికి 35.1 శాతానికి చేరింది. ప్రస్తుతం రష్యా నుంచే భారత్ అధికంగా చమురును దిగుమతి చేసుకుంటున్నది. పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆ దేశం భారత్‌కు 60 డాలర్లకే ఒక బ్యారెల్ చమురును విక్రయిస్తున్నది.