Chirag Paswan : కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్సభ ముందుకు తీసుకొచ్చిన ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్ (One Nation, One Election)’ బిల్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే.. ఏరకంగా రాజ్యాంగ విరుద్ధమో చెప్పాలని అధికార పక్షం డిమాండ్ చేస్తోంది. దేశమంతటా (లోక్సభ, రాష్ట్రాల శాసనసభలు) ఒకే దఫా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుపడేలా రాజ్యాంగంలో మార్పు చేయడం కోసం.. కేంద్రం 129వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది.
కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రతిపాదన మేరకు లోక్సభలో ఓటింగ్ నిర్వహించి బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. జేపీసీ బిల్లుపై సంపూర్ణ అధ్యయనం చేయనుంది. ఇదిలావుంటే ఆ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలపై లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ మండిపడ్డారు.
వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు ఏవిధంగా రాజ్యాంగ విరుద్ధమో చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధాలు మాట్లాడటం, అబద్ధపు ప్రచారం చేయడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని ఆరోపించారు. నిజంగా ఆ బిల్లు రాజ్యాంగ విరుద్ధమైతే, ఏవిధంగా రాజ్యాంగ విరుద్ధమో చెప్పవచ్చు కదా.. అని వ్యాఖ్యానించారు. ఒక్క ప్రతిపక్ష ఎంపీ కూడా ఆ బిల్లు ఏవిధంగా రాజ్యాంగ విరుద్ధమో చెప్పలేదని విమర్శించారు.