గౌహతి: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ (Himanta Sarma) మండిపడ్డారు. అస్సాంను బెదిరించడానికి మీకు ఎంత ధైర్యం? అని ప్రశ్నించారు. కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారానికి నిరసనగా బెంగాల్లో నిరసనలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, బీజేపీపై మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రధాని మోదీ, మీ ప్రజల ద్వారా బెంగాల్లో అశాంతి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ గుర్తుంచుకోండి. మీరు బెంగాల్‌ను తగులబెడితే అస్సాం, ఈశాన్యం, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ కూడా తగులబడతాయని గుర్తుంచుకోండి’ అని అన్నారు.
కాగా, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ బుధవారం దీనికి కౌంటర్ ఇచ్చారు. మమతా బెనర్జీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తన వైఫల్య రాజకీయాలతో భారతదేశానికి నిప్పు పెట్టడానికి ఆమె ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ‘దీదీ (మమతా బెనర్జీ), అస్సాంను బెదిరించడానికి మీకు ఎంత ధైర్యం? మీ రక్తపు కళ్ళు మాకు చూపించవద్దు. మీ వైఫల్య రాజకీయాలతో భారతదేశానికి నిప్పు పెట్టడానికి ప్రయత్నించవద్దు. విభజన భాష మాట్లాడటం మీకు సరిపోదు’ అని విమర్శించారు.
మరోవైపు మమతా బెనర్జీ తమను బెదిరించలేరని హిమంత బిస్వా శర్మ అన్నారు. ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలను నియంత్రించలేక తమను ఆమె బెదిరిస్తున్నారని విమర్శించారు. ‘ఆమె వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నా. అస్సాంలో ఇలా జరుగదు. నేను మీకు హామీ ఇస్తున్నా’ అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.