Supreme Court : సీజేపీ ఆందోళనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ సీజేపీ ఆందోళనలో పాల్గొన్న ఒక విద్యార్థికి ఒక మెజిస్ట్రేట్ నోటీసులు జారీ చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆందోళనకారులపై చర్యలు వద్దని తాము ఆదేశాలు ఇచ్చాక కూడా విద్యార్థికి నోటీసులు ఎలా జారీ చేస్తారని మెజిస్ట్రేట్‌ను ప్రశ్నించింది. మెజిస్ట్రేట్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. దీనిపై వివరణ ఇవ్వాలని మెజిస్ట్రేట్‌ను ఆదేశించింది.
జూలైలో సీజేపీ ఆందోళన సందర్భంగా హింస తలెత్తింది. ఈ సందర్భంగా ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా పలువురు ఆందోళనకారులపై కేసులు నమోదయ్యాయి. అయితే, వాటిని రద్దు చేయాలని ప్రభుత్వం.. సుప్రీంకోర్టును కోరింది. దీంతో సుప్రీంకోర్టు తన విశేష అధికారాల్ని ఉపయోగించి ఆందోళనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేసింది. ఉద్యమకారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సెప్టెంబర్ 1న ఆదేశించింది. ఈ ఆదేశాలున్నప్పటికీ గ్రేడర్ నోయిడాకు చెందిన ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సీజేపీకి చెందిన ఒక విద్యార్థికి సెప్టెంబర్ 4న నోటీసులు జారీ చేశారు.
గౌతమ్ బుద్ధా యూనివర్సిటీకి చెందిన అక్షత్ త్రిపాఠి అనే విద్యార్థి సీజేపీ ఆందోళనలో పాల్గొన్నాడు. అతడికి నోటీసులు జారీ చేయాల్సిందిగా తాజాగా పోలీసులు గ్రేటర్ నోయిడా మెజిస్ట్రేట్‌ను కోరారు. దీంతో ఆ మెజిస్ట్రేట్.. అక్షత్ త్రిపాఠికి నోటీసులు జారీ చేశారు. తాను ఎలాంటి ఆందోళనలు చేయకుండా, శాంతిగా ఉంటానని హామీ ఇస్తూ రూ.5 లక్షల బాండ్ సమర్పించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, తర్వాతి రోజే ఆ నోటీసుల్ని కోర్టు ఉపసంహరించుకుంది. అయినప్పటికీ.. ఈ అంశంపై బాధిత విద్యార్థి తరఫు లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ వీ మోహన్ ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ జరిపింది. ఆందోళనకారులపై చర్యలు తీసుకోకూడదని తాము ఆదేశించిన తర్వాత కూడా నోటీసులు జారీ చేయడంపై వారు విస్మయం వ్యక్తం చేశారు. ఇలా నోటీసులు ఇవ్వడానికి మెజిస్ట్రేట్‌కు ఎంత ధైర్యం అని ప్రశ్నించారు. తమ ఆదేశాల్ని ధిక్కరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని మెజిస్ట్రేట్‌ను కోరారు.