ఆ సంస్థ పేరులోనే ప్రధాని పేరుంటుంది. పేరు పక్కనే మూడు సింహాల రాజ ముద్ర ఉంటుంది. కరోనా సమయంలో దేశ ప్రజలను ఆదుకోవడానికి ఆ సంస్థ విరాళాలు సేకరించింది. ఆ సంస్థకు సంబంధించిన వివరాలు ఆర్టీఐ ద్వారా ఇమ్మంటే మాత్రం, అది ప్రభుత్వ సంస్థ కాదంటున్నది కేంద్రం. కానీ ట్రస్ట్‌గా పేర్కొన్న ఆ సంస్థకు విదేశీ విరాళాలు స్వీకరిస్తున్నారు. ఇంత పెద్ద సంస్థ నిధుల వ్యయంపై పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయమంటే చేయరు. అసలు ఇంత రహస్యంగా ఆ సంస్థను ఎందుకు నిర్వహిస్తున్నారు? ఎలా నిర్వహిస్తున్నారు… ఇలా జవాబు లేని ఎన్నో ప్రశ్నలకు కేంద్ర బిందువు… ‘పీఎం కేర్స్ ఫండ్’.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)
PM CARES Fund | హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : ప్రధాన మంత్రి సహాయ నిధిని కాదని పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్‌గా పీఎం కేర్స్ ఫండ్ సంస్థను మార్చి 27, 2020లో రిజిస్టర్ చేశారు. దాని ద్వారా కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్ దిగ్గజ సంస్థల నుండి ముక్కు పిండి మరీ విరాళాలు సేకరించారని ఆరోపణలు ఉన్నాయి. గత మూడేండ్లలో ఈ సంస్థకు మొత్తం రూ.12,691.82 కోట్ల విరాళాలు రాగా, అందులో రూ.535.44 కోట్లు విదేశాల నుంచి వచ్చాయి. అయితే ఈ నిధులను ఖర్చు పెట్టిన తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిధుల వినియోగంలో పారదర్శకత, రికార్డుల నిర్వహణ లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ కారణంగా ఏటా ఆ సంస్థకు వచ్చే విరాళాలు తగ్గిపోతున్నాయి. కరోనా సంక్షోభం గడిచిపోయినా, కనీసం సంస్థకు వచ్చిన విరాళాల్లో 50 శాతం కూడా ఆపత్కాలంలో ప్రజల కోసం ఖర్చు చేయలేదని ఆర్టీఐ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఆర్టీఐ ప్రకారం సమాచారం అడిగినా ఇవ్వడం లేదన్నారు. ఎన్జీవోలు విదేశీ నిధుల లెక్కలు సరిగా చెప్పడం లేదని వాటి ఎఫ్సీఆర్ఏ అనుమతి రద్దు చేస్తున్న కేంద్రం తన ఆధ్వర్యంలో నడిచే పీఎం కేర్స్ ఫండ్ పొందిన విదేశీ నిధులకు ఎందుకు లెక్కలు చెప్పదని వారు ప్రశ్నిస్తున్నారు. పీఎం కేర్స్ ఫండ్ నిధులతో ప్రభుత్వ దవాఖానల్లో వెంటిలేటర్లు, వలస కార్మికుల సంక్షేమం, తాత్కాలిక కొవిడ్ దవాఖానల స్థాపన లాంటి కార్యక్రమాలు చేపట్టామని ప్రభుత్వం చెప్తున్నది. కానీ వాటికి సంబంధించిన రుజువులు, బిల్లులు మాత్రం ఎందుకు చూపడం లేదని ఎన్జీవోలు, ప్రతిపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి. అయితే ఈ ప్రశ్నలకు కేంద్రం జవాబు చెప్పడం లేదు.
ప్రధాన మంత్రి పీఎం కేర్స్ ఫండ్‌కి ఎక్స్ అఫీషియో చైర్మన్. కేంద్ర రక్షణ మంత్రి, హోం మంత్రి, ఆర్థిక మంత్రులు ఈ సంస్థకు ఎక్స్ అఫీషియో ట్రస్టీలుగా ఉన్నారు. వీరు కాకుండా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్, కరియా ముండా, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాలను ట్రస్టీలుగా నామినేట్ చేశారు.