పాట్నా: బీహార్లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న జేడీయూ అధినేత, సీఎం నితీశ్ కుమార్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. చరిత్రను ఎవరైనా మార్చగలరా? అని ప్రశ్నించారు. ‘చరిత్రను మారుస్తారా? దానిని ఎవరు ఎలా మార్చుతారో అన్నది అర్థం కావడం లేదు’ అని వ్యాఖ్యానించారు.
కాగా, ఇటీవల ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా చరిత్ర కారులను అమిత్ షా విమర్శించారు. దేశంలో చాలా సామ్రాజ్యాలు శతాబ్దాలుగా ఏలినప్పటికీ మొఘల్ పరిపాలనకే చరిత్ర కారులు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. ‘నేను చరిత్రకారులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనకు చాలా సామ్రాజ్యాలు ఉన్నాయి. కానీ, చరిత్రకారులు మొఘలులపై మాత్రమే దృష్టి పెట్టారు. వారి గురించే ఎక్కువగా రాశారు. పాండ్య సామ్రాజ్యం 800 సంవత్సరాలు పాలించింది. అహోం సామ్రాజ్యం 650 ఏళ్లు అస్సాంను పాలించింది. వారు (అహోంలు) భక్తియార్ ఖాల్జీ, ఔరంగజేబును కూడా ఓడించి అస్సాంను సార్వభౌమాధికారంగా ఉంచారు. పల్లవ సామ్రాజ్యం 600 సంవత్సరాలు పాలించింది. చోళులు 600 సంవత్సరాలు పాలించారు’ అని తెలిపారు.
అలాగే ‘మౌర్యులు మొత్తం దేశాన్ని, ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక వరకు 550 సంవత్సరాలు పాలించారు. శాతవాహనులు 500 సంవత్సరాలు పాలించారు. గుప్తులు 400 సంవత్సరాలు పాలించారు. గుప్తుల చక్రవర్తి సముద్రగుప్తుడు మొదటిసారి అఖండ భారతావని లక్ష్యంగా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ అంశాలు చారిత్రక పుస్తకాల్లో లేవు’ అని అమిత్ షా చెప్పారు. ఈ నేపథ్యంలో గత వైభవాన్ని వర్తమానానికి పునరుజ్జీవింపజేయాలని దేశంలోని చరిత్రకారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. దేశ ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఇది దోహదపడుతుందని అన్నారు.
కాగా, అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందించాలని సీఎం నితీశ్ కుమార్ను మీడియా సోమవారం కోరింది. దీంతో ఆయన తనదైన స్టైల్లో జవాబిచ్చారు. ‘చరిత్ర అంటే ఏమిటి, ఎవరైనా దానిని ఎలా మార్చగలరు?’ అని ప్రశ్నించారు. ‘చరిత్రను మారుస్తారా? దానిని ఎవరు ఎలా మార్చుతారో అన్నది అర్థం కావడం లేదు’ అని వ్యాఖ్యానించారు. చరిత్ర అంటే చరిత్రే అని అన్నారు. ‘భాష అనేది వేరే సమస్య. కానీ మీరు ప్రాథమిక చరిత్రను మార్చలేరు’ అంటూ అమిత్ షా వ్యాఖ్యలను ఆయన ఎద్దేవా చేశారు.
इतिहास के पुनर्लेखन की भाजपा की माँग पर @NitishKumar ने दो टूक शब्दों में कहा कि जो मौलिक इतिहास हैं उसको कैसे बदला जा सकता हैं @ndtvindia @Anurag_Dwary pic.twitter.com/OYK7lyJbBL
— manish (@manishndtv) June 13, 2022