hostel| న్యూఢిల్లీ: విద్యార్థులు ఇకపై హాస్టల్ వసతికి మరింత ఫీజు చెల్లించాల్సి రావొచ్చు. హాస్టల్ అకామిడేషన్‌కు చెల్లించే అద్దెపై 12 శాతం జీఎస్టీ వర్తిస్తుందని అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్) రెండు వేర్వేరు కేసుల్లో తాజాగా స్పష్టంచేసింది. పేయింగ్ గెస్ట్ (పీజీ), హాస్టళ్లు.. గృహ వసతి కిందకు రావని, కాబట్టి వీటికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఉండదని ఏఏఆర్ కర్ణాటక బెంచ్ తెలిపింది. రోజుకు రూ. 1000 కంటే తక్కువ అద్దె వసూలు చేసే హాస్టళ్లకు 2022 జూలై 17 వరకు మాత్రమే జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చినట్టు గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో హాస్టళ్లపై 12 శాతం జీఎస్టీ వర్తిస్తుందని స్పష్టంచేసింది.
గృహ వసతులకు మాదిరిగానే హాస్టళ్లకు కూడా అద్దె వసూలు చేస్తున్నందున వీటికి జీఎస్టీ వర్తించదని కర్ణాటకలో హాస్టళ్లను నిర్వహిస్తున్న శ్రీసాయి సంస్థ ఏఏఆర్ ముందు వాదించింది. ‘హాస్టళ్లలో ఒకరికొకరు సంబంధం లేని వ్యక్తులకు షేరింగ్ పద్ధతిలో గదులను కేటాయిస్తారు. బెడ్లవారీగా ఫీజు వసూలు చేస్తారు. వ్యక్తిగత కిచెన్ ఉండదు. వంటకు అనుమతించరు. ఇవి శాశ్వత గృహ వసతి లక్షణాల కిందకు రావు’ అని ఏఏఆర్ స్పష్టంచేసింది.
నోయిడాకు చెందిన వీఎస్ ఇన్స్టిట్యూట్ అండ్ హాస్టల్స్ సంస్థ కూడా ఇదే తరహా పిటిషన్ దాఖలు చేసింది. వసతి, ఆహారం, విద్యుత్తు, వైఫై వంటి అన్ని నివాస సదుపాయాలు కల్పిస్తున్నందున జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది. ఈ వాదనను ఏఏఆర్ లక్నో బెంచ్ తిరస్కరించింది. గృహ వసతి శాశ్వత నివాసానికి సంబంధించినదని.. హాస్టళ్లు, గెస్ట్‌హౌస్‌లు, లాడ్జిలు వీటి కిందకు రావని స్పష్టంచేసింది.