Road Accident | పండుగ పూట విషాదం చోటు చేసుకున్నది. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఐదుగురు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ఘటన యూపీ బదౌన్‌లోని ముజారియా పోలీస్‌స్టేషన్ పరిధిలో మీరట్ హైవేపై చేసుకున్నది. ముజారియా గ్రామ సమీపంలో గురువారం ఉదయం టెంపోను ట్రాక్టర్ ఢీకొట్టింది. దాంతో టెంపోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. ఆ తర్వాత వెనుక నుంచి వస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న వారు సైతం గాయపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఇక మృతులను నోయిడాకు చెందిన వారిగా గుర్తించారు. దీపావళి పండుగ కోసం వారంతా నోయిడాకు తిరిగి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. హైవేపై రాంగ్ రూట్లో వచ్చిన ట్రాక్టర్ టెంపోను ఢీకొట్టిందని సమాచారం. ఆ తర్వాత వెనుక నుంచి వచ్చిన కారు సైతం డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో టెంపో నుజ్జునుజ్జయింది. క్షతగాత్రుల కేకలు విని స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులందరినీ అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించగా.. ఆరుగురు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుల్లో ఓ చిన్నారి సైతం ఉన్నది. మృతుల్లో ఒకరిని మిర్జాపూర్ వాసిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం అనంతరం ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.