Strait of Hormuz : ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన ‘హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)’ లో నెలకొన్న ఉద్రిక్తతలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. అమెరికా, ఇరాన్ (US, Iran) దేశాల మధ్య జరిగిన దౌత్యపరమైన చర్చలు సఫలం కావడంతో ఈ సముద్ర మార్గంలో నౌకల రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఈ పరిణామం మన దేశానికి పెద్ద ఊరటనిచ్చింది. భారత్ (India) కు చెందిన 30 నౌకలు ఇప్పటికే సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటాయి. మరో 26 నౌకలు ప్రయాణ అనుమతి కోసం క్యూలైన్లో వేచి ఉన్నాయి. భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖ (India’s shipping Ministry) వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి వచ్చే ముడిచమురు, ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ), వ్యవసాయానికి అవసరమైన ఎరువుల సరఫరా కోసం భారతదేశం ప్రధానంగా ఈ మార్గంపైనే ఆధారపడుతుంది. తాజా పరిణామాలతో దేశంలో ఇంధన భద్రతకు ఉన్న ముప్పు తప్పినట్లయింది. ఇటీవలి ప్రాంతీయ ఘర్షణల కారణంగా ఇరాన్ ఈ జలసంధిపై పట్టు బిగించి, నౌకల రాకపోకలను అడ్డుకోవడంతో వందలాది నౌకలు పర్షియన్ గల్ఫ్‌లోనే నిలిచిపోయాయి. అయితే అమెరికా-ఇరాన్ ఒప్పందం ప్రకారం ప్రస్తుతం రాకపోకలను క్రమంగా పునరుద్ధరిస్తున్నారు. ఇంకా వేచి ఉన్న 26 భారతీయ నౌకల్లో 3 నౌకలు ఇంధన లోడుతో, 10 నౌకలు ఎరువులతో, మిగిలిన 13 నౌకలు ఇతర నిత్యావసర వస్తువులతో ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాయి.
ఇప్పటికే అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి చెందిన రెండు భారీ ఎల్ఎన్జీ ట్యాంకర్లు సురక్షితంగా ప్రయాణించి తమిళనాడులోని ఎన్నూర్, కేరళలోని కొచ్చి టెర్మినల్స్‌కు గ్యాస్ చేరవేశాయి. హర్మూజ్ జలసంధి ద్వారా రవాణా సాఫీగా సాగితే దేశంలో ఇంధన ధరలు స్థిరపడతాయని, ఎరువుల కొరత తీరి వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే యుద్ధం ముగిసినప్పటికీ బీమా ఖర్చులు పెరగడం, సముద్రంలో మైన్ల తొలగింపు వంటి సవాళ్లు ఉన్నందున రవాణా పూర్వస్థితికి రావడానికి మరికొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉంది.
ప్రస్తుతం భారత ప్రభుత్వం తన నౌకాదళం ద్వారా ‘ఆపరేషన్ ఊర్జా సురక్ష’ను నిర్వహిస్తూ, భారతీయ నౌకలకు రక్షణ కల్పిస్తూ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోంది.