Cancer | న్యూఢిల్లీ: అత్యంత తీవ్ర రూపాల్లోని క్యాన్సర్‌కు కొత్త చికిత్సా విధానాన్ని అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘నేచర్ జెనెటిక్స్’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయన నివేదిక ప్రకారం.. బ్రిటన్‌లోని దాదాపు 15 వేల మంది క్యాన్సర్ రోగుల సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. వీరిలో 39 రకాల కణుతులు గలవారు ఉన్నారు. వీరిలో 16 శాతం మందికిపైగా ఎక్స్ట్రా క్రోమోజోమల్ డీఎన్ఏ (ఈసీడీఎన్ఏ) కలవారు ఉన్నారు. కణితి (ట్యూమర్) పెరుగుదలను ప్రేరేపించే, కీమో థెరపీని నిరోధించే బలహీనమైన, అస్థిరమైన డీఎన్ఏను లక్ష్యంగా చేసుకుని చికిత్స చేసే విధానాన్ని గుర్తించారు. చికిత్స చేయడం సంక్లిష్టమైన క్యాన్సర్లలో ఈసీడీఎన్ఏ, కొద్దిగా జెనెటిక్ మెటీరియల్ ఉంటాయని కనుగొన్నారు. ఈ ఈసీడీఎన్ఏను అరికట్టగలిగే ఔషధాన్ని కూడా ఈ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఈ మందుపై క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్నాయి. ఈ ఔషధం ఈసీడీఎన్ఏతో కూడిన క్యాన్సర్ సెల్స్‌ను ఎంపిక చేసి మరీ తుదముట్టించగలదు. ఫలితంగా వీటిలో ఔషధాలను తట్టుకోగలిగే సామర్థ్యం వేగంగా వృద్ధి చెందకుండా నిరోధిస్తుంది. అనేక రకాల క్యాన్సర్లకు ట్యాక్సోల్ బేస్డ్ థెరపీస్ చేస్తారు. డొసెటాక్సెల్, పక్లిటాక్సెల్ వంటి థెరపీలు చేస్తారు.
ఈ చికిత్సల తర్వాత ఈసీడీఎన్ఏ తరచూ కనిపిస్తున్నట్లు ఈ అధ్యయనం గుర్తించిందని యేల్ విశ్వవిద్యాలయం తెలిపింది. ఈ అధ్యయన నివేదిక రచయితల్లో ఒకరైన వెర్హాక్ మాట్లాడుతూ, ఈసీడీఎన్ఏ ఉన్న ట్యూమర్లలోని బలహీనతలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈసీడీఎన్ఏ లక్ష్యంగా జరిగే చికిత్సల వల్ల క్యాన్సర్ రోగుల్లో మూడో వంతు మంది ప్రయోజనం పొందే అవకాశం ఉందని తెలిపారు.