Nowgam Blast | జమ్మూ కశ్మీర్ నౌగామ్ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన బ్లాస్ట్‌పై కేంద్ర హోంమంత్రిత్వశాఖ స్పందించింది. ఈ పేలుడు ఘటనలో తొమ్మిది ప్రాణాలో కోల్పోయారని.. 27 మంది పోలీసులు, ఇద్దరు రెవెన్యూ అధికారులు, ముగ్గురు పౌరులు గాయపడ్డారని పేర్కొంది. నౌగామ్ పేలుడుపై మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ (జమ్మూ కశ్మీర్ డివిజన్) ప్రశాంత్ లోఖండే మాట్లాడుతూ.. పేలుడు కారణంగా పోలీస్ స్టేషన్ భవనం, చుట్టుపక్కల ఉన్న కొన్ని నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నామన్నారు.
ఈ విషయంలో ఎలాంటి ఊహాగానాలను నమ్మకూడదన్నారు. శుక్రవారం రాత్రి 11:20 గంటల ప్రాంతంలో నౌగామ్ పోలీస్ స్టేషన్ లోపల దురదృష్టకర ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించిందని ఆయన అన్నారు. టెర్రర్ మాడ్యూల్ దర్యాప్తు సమయంలో పేలుడు పదార్థాలు, రసాయనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌లోని బహిరంగ ప్రదేశంలో సురక్షితంగా నిల్వ చేశారన్నారు. ప్రామాణిక దర్యాప్తు విధానంలో భాగంగా నమూనాలను సేకరిస్తున్న సమయంలో పేలుడు జరిగిందన్నారు. ఫోరెన్సిక్ టెస్ట్ కోసం నమూనాలను సేకరిస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందన్నారు.
హర్యానా ఫరీదాబాద్ నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు అస్థిరంగా, సున్నితంగా ఉన్నాయని.. ఈ విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లోఖండే పేర్కొన్నారు. నమూనాలు సేకరిస్తున్న సమయంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించినట్లుగా చెప్పారు. పోలీస్ స్టేషన్లో జరిగిన పేలుడుపై దర్యాప్తు కొనసాగుతోందని.. పేలుడులో గాయపడ్డ వారికి వెంటనే వైద్య చికిత్స కోసం తరలించినట్లు చెప్పారు. పోలీస్ స్టేషన్లో జరిగిన పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు జరుగుతుందన్నారు. ఈ సమయంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం సంఘీభావం తెలుపుతుందన్నారు.
VIDEO | Delhi: On the explosion at J&K’s Nowgam Police Station, Prashant Lokhande, Joint Secretary (J&K Division), MHA, says, “Yesterday, at around 11:20 pm, an unfortunate accidental explosion took place inside the Nowgam Police Station. During the investigation of a terror… pic.twitter.com/tDLyHN3SxE
— Press Trust of India (@PTI_News) November 15, 2025