Monsoon Session | లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్ పునర్యవ్వస్థీకరణ సవరణ బిల్లు, యూటీల సవరణ బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. అయితే, ఈ మూడు బిల్లులను వ్యతిరేకిస్తూ లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఈ మూడు బిల్లులు రాజ్యాంగ వ్యతిరేకమని కాంగ్రెస్ ఆరోపించింది. విపక్ష ఎంపీల నిరసనల మధ్య లోక్‌సభ వాయిదా పడింది. బిల్లులను ప్రవేశపెట్టే సమయంలో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. అమిత్ షా అరెస్టయిన సందర్భంలో నైతికత ప్రదర్శించారా? ప్రశ్నించారు.
దీనికి హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ.. తనపై ఆరోపణలు వచ్చిన సమయంలో.. అరెస్టుకు ముందే నైతికంగా రాజీనామా చేశానన్నారు. కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించే వరకు ఏ రాజ్యాంగ పదవిని చేపట్టలేదన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడు బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని స్పీకర్‌కు సిఫారసు చేశారు. ఈ సమయంలో ప్రతిపక్షాలు తీవ్ర గందరగోళం సృష్టించాయి. ప్రతిపక్షాలు బిల్లు కాపీని చించి కేంద్ర హోం మంత్రి వైపు విసిరేశారు. స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు.
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కట్టబెట్టిన ఆర్టికల్ 370ని రద్దు చేసి ఆరేళ్లు కావొస్తోంది. 2019 ఆగస్టు 5న ఈ ఆర్టికల్‌ను తొలగించి.. జమ్ము కశ్మీర్, లద్ధాఖ్ అని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు(Union Territories)గా ప్రకటించింది కేంద్రం. తిరిగి జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కట్టబెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నది. ఈ క్రమంలోనే బుధవారం లోక్‌సభలో జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది.