Amit Shah | జమ్మూ కశ్మీర్లో ఇటీవల ఉగ్రదాడుల ఘటనల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత వారంరోజుల వ్యవధిలోనే నాలుగు దాడి ఘటన జరిగాయి. తాజాగా అమర్నాథ్ యాత్రకు సమయం దగ్గరపడుతున్నది. ఈ క్రమంలో యాత్రకు సంబంధించి తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై హోంశాఖ మంత్రి అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు ఐదుగంటల పాటు సమావేశం కొనసాగించింది. అయితే, ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడేందుకు ఉపయోగిస్తున్న సొరంగాలను గుర్తించాలని.. అదే సమయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిఘా వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు.
డ్రోన్ చొరబాట్లను సైతం సమర్థవంతంగా ఎదుర్కోవాలని చెప్పారు. జీరో టెర్రర్ ప్లాన్‌తో కశ్మీర్ లోయలో ఎలాగైతే శాంతి నెలకొన్నదో.. అదే ప్రణాళికను జమ్మూ ప్రాంతంలోనూ అమలు చేయాలన్నారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ప్రభుత్వం సరికొత్త మార్గాలను అవలంభిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో సైన్యం, పారామిలిటరీ బలగాలు పరస్పర సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన స్పందించాలని షా సూచించారు. భద్రతాపరంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదంపై పోరు ప్రస్తుతం నిర్ణయాత్మక దశలో ఉందని, ఈ స్థితిలో ఉదాసీనంగా వ్యవహరిచొద్దని చెప్పారు. ఇటీవలి ఘటనలు ఉగ్రవాద చర్యలు భారీ హింసాత్మక ఘటనల నుంచి చిన్నాచితకా దాడుల స్థాయికి పడిపోయాయని, వాటిని సైతం నిర్మూలించడానికి కృతనిశ్చయంతో ఉన్నామని షా తెలిపారు. సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, కాబోయే ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, కేంద్ర నిఘా సంస్థ డైరెక్టర్ తపన్ దేకా, సీఆర్పీఎఫ్ డీజీ అనీశ్ దయాళ్ సింగ్, బీఎస్ఎఫ్ డీజీ నితిన్ అగర్వాల్, డీజీపీ ఆర్ఆర్ స్వైన్ తదితరులు హాజరయ్యారు.