బెంగళూరు: హాలీ సందర్భంగా నిర్వహించిన పార్టీ హింసాత్మకంగా మారింది. ఒక మహిళపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మద్యం మత్తులో కొందరు వ్యక్తులు ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకున్నారు. (Holi Party Turns Violent) హింసాత్మక దాడిలో ముగ్గురు మరణించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. బీహార్‌లోని ఒకే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు బెంగళూరు శివారులోని అనేకల్‌లో నిర్మిస్తున్న అపార్ట్మెంట్ బిల్డింగ్‌లో పనులు చేస్తున్నారు.
కాగా, హోలీ రోజున రాత్రి వేళ ఆరుగురు కూలీలు మందు పార్టీ చేసుకున్నారు. ఒక మహిళ గురించి అనుచిత వ్యాఖ్యలపై వారి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కర్రలు, ఇనుప రాడ్లను ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ సంఘటనలో ముగ్గురు మరణించారు.
మరోవైపు ఘర్షణ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. రక్తం మడుగుల్లో వేర్వేరు చోట్ల పడి ఉన్న ముగ్గురు బీహార్ కూలీల మృతదేహాలను గమనించారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు మృతులను 22 ఏళ్ల అన్సు, 23 ఏళ్ల రాధే శ్యామ్‌గా గుర్తించారు.
సంఘటనా స్థలంలో గాయాలతో పడి ఉన్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు మృతికి కారణమైన పరారీలో ఉన్న ఇద్దరు వ్యక్తుల కోసం వెతుకుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.