పాట్నా: బీహార్లో ‘హిట్లర్షాహి’ ప్రభుత్వం నడుస్తున్నదని ఎన్డీయే మిత్రపక్షానికి చెందిన ముఖేష్ సహానీ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వికాశీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)కి ఒక టికెట్ అయినా కేటాయించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ-జేడీయూకి వ్యతిరేకంగా తమ అభ్యర్థులను నిలబెడతామని హెచ్చరించారు.
బీహార్లో 24 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీ 13 స్థానాల్లో పోటీ చేస్తుండగా, అందులో ఒక స్థానాన్ని పసుపతి కుమార్ పరాస్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జేపీ)కి ఇవ్వనుంది. జేడీ(యూ) 11 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనున్నది. బీహార్ బీజేపీ ఇన్ఛార్జ్ భూపేంద్ర యాదవ్ ఈ మేరకు శనివారం ప్రకటించారు. అయితే ఎన్టీయే కూటమిలోని జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థాన్ అవామీ మోర్చా (HAM)తోపాటు వికాశీల్ ఇన్సాన్ పార్టీ (VIP)కి మొండిచేయి చూపారు.
దీంతో వికాశీల్ ఇన్సాన్ పార్టీ నేత ముఖేష్ సహానీ ఆదివారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ-జేడీయూ తీరుపై మండిపడ్డారు. మాంఝీ-సహానీల కారణంగానే బీహార్లో ప్రభుత్వం నిలుస్తోందని ఆయన అన్నారు. తాము చాలా శక్తిమంతులమని, సరైన నిర్ణయం తీసుకున్నామని బీజేపీ-జేడీయూ భావిస్తున్నాయని విమర్శించారు. ఇది ‘హిట్లర్షాహి’ లాంటిదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో 24 ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయాలని తాము నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
మరోవైపు బీహార్లో ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్ తెలిపారు. దీంతో మహాకూటమిలోని కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించింది. తమకు ఆ సత్తా ఉందని కాంగ్రెస్ పేర్కొంది.